తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి ఎవరి జాగీరు కాదని, వైసీపీ పార్టీ నాయకులంతా వస్తారన్నారు. ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడను అని చెప్పారు. తాను అవినీతి చేసుంటే.. విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. తాడిపత్రిలోనే కాదు అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తాం అని వెంకటరామిరెడ్డి చెప్పుకొచ్చారు.
అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ… ‘నా తల్లిదండ్రులు నన్ను సంస్కారంతో పెంచారు. నాలుగు సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశా. నాపై ఆరోపణలు, దుర్భాషలను జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞతకు వదిలేస్తున్నా. తాటాకు చప్పులకు భయపడేదీ లేదు. దౌర్జన్మమే మీ సంస్కృతా జేసీ?. నేను అవినీతి చేసుంటే విచారణ చేసుకోవచ్చు. 1985 నుంచి జేసీ సంపాదించిన ఆస్తులపై విచారణకు సిద్ధమా?. నాకు సభ్యత ఉంది కాబట్టి ఆయనను నేను తిట్టలేను. జేసీ బెదిరింపులకు నేను భయపడను. తాడిపత్రి ఎవరి జాగీరు కాదు. మా పార్టీ నాయకులంతా వస్తారు, మా నాయకుడు వైఎస్ జగన్ కూడా వస్తారు. తాడిపత్రిలోనే మీటింగ్ పెడతాం. అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.
కూటమి ప్రభుత్వం జోలికి వస్తే తాట తీస్తానని తాడిపత్రి టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం హెచ్చరించారు. పలుమార్లు ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచిన అనంత వెంకటరామిరెడ్డికి మున్సిపాలిటీ అభివృద్ధిపై కనీస అవగాహన లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ గురించి ఇంకోసారి అవాకులు చవాకులు పేలితే.. ఇంటికి వచ్చి తంతానని జేసీ హెచ్చరించారు. జేసీ వ్యాఖ్యలపై నేడు అనంత స్పందించారు.