Squash Champion: ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా అనాహత్ సింగ్.. భారత్ తరఫున సరికొత్త చరిత్ర..

Squash

Squash

భారత యువ స్క్వాష్ సంచలనం అనాహత్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కెనడాలోని నయాగరా-ఆన్-ది-లేక్‌లో జరిగిన ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచి, గర్ల్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా 18 ఏళ్ల అనాహత్ రికార్డు పుటలకెక్కింది. ఫైనల్ పోరులో టాప్ సీడ్ అనాహత్ సింగ్, రెండో సీడ్ ఈజిప్ట్ క్రీడాకారిణి రుకాయ్యా సలెమ్‌ను వరుస గేమ్‌లలో చిత్తు చేసింది. మొదట్నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన అనాహత్ 11-3, 11-7, 11-9 తేడాతో విజయం సాధించి బంగారు పతకాన్ని ముద్దాడింది. ఈ విజయం ద్వారా దాదాపు 15 ఏళ్లుగా ప్రపంచ జూనియర్ స్క్వాష్‌లో కొనసాగుతున్న ఈజిప్ట్ ప్లేయర్ల ఆధిపత్యానికి అనాహత్ చెక్ పెట్టింది.

21 ఏళ్ల తర్వాత రికార్డు తిరగరాసి..
గతంలో 2005లో భారత స్క్వాష్ దిగ్గజం జోష్నా చిన్నప్ప ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు ఏ భారతీయ ప్లేయర్ కూడా ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఇప్పుడు అనాహత్ ఏకంగా టైటిల్ గెలుచుకుని జోష్నా రికార్డును అధిగమించడమే కాకుండా, భారత్‌కు మొదటి పసిడి పతకాన్ని అందించింది.

‘నా కల నెరవేరింది. జూనియర్ స్థాయిలో నాకు ఇదే చివరి అవకాశం కాగా, ఈ విజయం సాధించడం ఎంతో గర్వంగా ఉంది’ అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేసింది. గతంలో బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకున్న అనాహత్, ఈసారి లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు విశేష ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఆమె సాధించిన ఈ చారిత్రక ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.