NTV Telugu Site icon

Bihar: విద్యార్థులు హాజరు కాలేదని..దాదాపు రూ.23లక్షల జీతం తిరిగి ఇచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్..

Bihar

Bihar

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని నితీశేశ్వర్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లాలన్ కుమార్ తన 33 నెలల జీతాన్ని తిరిగి జీతాల విభాగానికి అందజేశారు. సుమారు దాదాపు రూ. 23 లక్షలు తిరిగి ఇచ్చారు. ఆయన 2019 సెప్టెంబర్‌లో ఉద్యోగంలో చేరారు. ఈ 33 నెలల్లో విద్యార్థులు తన తరగతికి హాజరుకాలేదని ఆయన తెలిపారు. బోధించకుండా డిపార్ట్‌మెంట్ నుంచి జీతం తీసుకోవడానికి తన మనస్సాక్షి అనుమతించలేదని ఆయన అన్నారు. లాలన్ కుమార్ మంగళవారం బీఆర్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం (BRABU) రిజిస్ట్రార్‌కు 23,82,228 రూపాయల చెక్కును తిరిగి ఇచ్చారు. కళాశాల రాష్ట్ర విశ్వవిద్యాలయమైన బీఆర్ఏబీయూ (BRABU) ఆధ్వర్యంలో ఉంది. మీడియాతో లలన్ కుమార్ మాట్లాడుతూ.. ‘బోధించకుండా జీతం తీసుకోవడానికి నా మనస్సాక్షి అనుమతించదు. ఆన్‌లైన్ తరగతుల సమయంలో (కరోనా సమయంలో) కూడా హిందీ తరగతులకు కొద్దిమంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఐదేళ్లు బోధించకుండా జీతం తీసుకుంటే అది నాకు విద్యా మరణమే.” అని లాలన్ కుమార్ పేర్కొన్నారు.

READ MORE: Ola: గూగుల్ మ్యాప్ సర్వీస్ ను నిలిపేసిన ఓలా..ఏటా రూ. 100 కోట్ల లాభం..

జీతం తిరిగివ్వడం సరికాదు..ప్రిన్సిపల్
1970లో స్వాతంత్ర్య సమరయోధుడు నితీశేశ్వర్ ప్రసాద్ సింగ్ చేత స్థాపించబడిన నితీశేశ్వర్ కళాశాల 1976 నుంచి (BRABU)తో అనుబంధంగా ఉంది. ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. లలన్ కుమార్ జీతం తిరిగి ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ ప్రశ్నించారు. ‘ఇక్కడ ప్రశ్న కేవలం హాజరుకాని విద్యార్థుల గురించి కాదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగానికి బదిలీ కావాలనే ఒత్తిడి వ్యూహం’ అని ఆయన అన్నారు. ఇంతలో, BRABU రిజిస్ట్రార్ ఆర్కే ఠాకూర్ ఈ చర్యను అభినందించారు. లాలన్ కుమార్ చేసినది చాలా అసాధారణమైనదని ఆయన అన్నారు. ఈ విషయమై వైస్ ఛాన్సలర్‌తో చర్చిస్తున్నామని, గైర్హాజరుపై వివరణ ఇవ్వాలని నితీశేశ్వర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను త్వరలో కోరతామన్నారు.