Amol Muzumdar: టీమిండియా కల నిజమైన క్షణం అది.. చాలా కాలంగా కోట్లాది మంది స్నప్నాన్ని నిజం చేస్తూ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను భారత మహిళా జట్టు ముద్దాడి క్షణం అది.. గెలిచిన తర్వాత ఆనందంతో కన్నీటి పర్యంతం అయిన భారత మహిళా జట్టు గురించి దేశం మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటుంది. కానీ ఇక్కడ ప్రపంచం, దేశం.. అందరూ తెలుసుకోవాల్సిన నిజమైన ఛాంపియన్ ఎవరో తెలుసా.. అమోల్ ముజుందార్. ఆయన తన కెరీర్‌లో ఎప్పుడూ కూడా భారత జట్టు జెర్సీని ధరించకపోయినా, దేశం కోసం ఆడిన వారు కూడా చేయలేనిది సాధించాడు. ముంబైకి చెందిన ఈ మాజీ రంజీ ప్లేయర్ టీమిండియాను ప్రపంచ ఛాంపియన్‌గా చేయడంలో కీ రోల్ పోషించాడంటే అతిశయోక్తి కాదు. భారత మహిళా జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Chevella Accident : చేవెళ్ల ప్రమాదం వెనుక నిజాలు బహిర్గతం చేసిన ప్రత్యక్ష సాక్షి !
అమోల్ మజుందార్ తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను 1993లో ముంబై జట్టుతో ప్రారంభించాడు. రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో అమోల్ మజుందార్ 171 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 11,000 పరుగులు సాధించాడు. ఈ కాలంలో ఆయన 30 సెంచరీలు చేశాడు. కానీ టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. రంజీల్లో అద్భుతమైన ప్రదర్శనలు చేసిన భారత జట్టులో అవకాశం రాకపోవడంతో అమోల్ ముజుందార్ నిరాశ చెందాడు. దీంతో ఆయన 2014లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి కోచింగ్ వైపు మొగ్గు చూపాడు. ఆయన తన కెరీర్‌లో నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లతో కలిసి పనిచేశాడు. ఈ సమయంలో ఆయనకు గొప్ప పేరు వచ్చింది. అక్టోబర్ 2023లో ఆయన భారత మహిళా జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆ సమయంలో దేశం తరపున ఎప్పుడూ ఆడని వ్యక్తి కోచ్ ఎలా అవుతాడని చాలామంది ప్రశ్నించారు. కానీ ఆయన భారత మహిళా జట్టుకు అందించిన అపూర్వ విజయంతో ఇప్పుడు ప్రశ్నించిన వారందరి నోళ్లు మూతపడ్డాయి.
జట్టును గెలుపు దిశను మార్చిన వ్యక్తి..
వన్డే ప్రపంచ కప్‌లో భారత మహిళా జట్టు 2005, 2017లో ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఎప్పుడూ కూడా ఛాంపియన్‌గా అవతరించలేదు. అయితే ఈసారి టీమిండియా గతానికి భిన్నమైన అద్భుత ప్రదర్శన చేసి కలను నిజం చేసుకుంటూ ట్రోఫీని ముద్దాడింది. దీనికి ప్రధాన కారణం భారత మహిళా జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్. ఆయన శిక్షణలో క్రీడాకారులు రాటుదేలి, కప్‌ను ముద్దాడారు. ఆయనకు ఈ చిరస్మరణీయమైన విజయం అంత సులభంగా లభించలేదు. క్రీడాకారులతో సమానంగా ఆయన కష్టపడి పనిచేశాడు. జట్టులోని వారి బలహీనతలను తెలుసుకొని వారిని ఆ బలహీనతలను అధిగమించేలా అనునిత్యం ప్రోత్సహిస్తూ వారిని విజయం దిశగా నడించాడు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్‌కు ముందు మజుందార్ డ్రెస్సింగ్ రూమ్ వైట్‌బోర్డ్‌పై ఒకే ఒక లైన్ రాశారని చెప్పారు. “ఫైనల్‌కు చేరుకోవడానికి మనం వారి కంటే ఎక్కువ పరుగులు చేయాలి, అంతే.” ఆ లైన్ సరళంగా అనిపించవచ్చు, కానీ అది మా హృదయాల్లో నిలిచిపోయింది. మజుందార్ నిర్ణయించుకున్నట్లుగా జెమిమా రోడ్రిగ్స్ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసింది. ఆమె చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిందని ఆమె చెప్పారు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తర్వాత అమోల్ మజుందార్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి, ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది. ఆయన ఈ విజయానికి ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. ఎందుకంటే ఆయన ఇది కేవలం విజయం మాత్రమే కాదు, ఇది ఒక కల. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడంపై ఆయనకున్న బాధ అనేది భారత మహిళా జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంతో తొలగిపోయింది.
అమోల్ మజుందార్ పాదాలను తాకిన హర్మన్‌ప్రీత్ కౌర్ ..
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత మహిళా జట్టు విజయం అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ హెడ్ కోచ్ అమోల్ మజుందార్ పాదాలను తాకి, ఆలింగనం చేసుకుంది. ఈ చిత్రం టీమిండియా చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే చిత్రం. ఈ సంఘటన ఆమెకు కోచ్‌పై ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. మ్యాచ్ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కోచ్ అమోల్ గురించి మాట్లాడుతూ.. “గత రెండు సంవత్సరాలుగా సర్ సహకారం అద్భుతంగా ఉంది. ఆయన వచ్చిన తర్వాత అంతా బాగానే జరిగింది. ఆయన మమ్మల్ని పగలు, రాత్రి ప్రాక్టీస్ చేయించి, ఏలా తమ ఆట తీరును మెరుగుపరుచుకోవాలో చెప్పారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మాకు లభించినందుకు నేను నిజంగా సంతోషంగా గర్విస్తున్నాను” అని అన్నారు.
READ ALSO: US Airstrikes Nigeria: క్రైస్తవ దేశంపై అమెరికా వైమానిక దాడులు.. ఇక వారికి చావే!
