NTV Telugu Site icon

Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో నెయ్యి, వంట నూనెల కొరత..

Pakistan

Pakistan

Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పై రోజుకో పిడుగు పడుతోంది. ఇప్పటికే అక్కడ గోధుమ సంక్షోభం నెలకొంది. ప్రజలకు నిత్యాసరం అయిన పిండి అందుబాటులో లేదు. తాజాగా మరో సంక్షోభం కూడా రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు అక్కడి వ్యాపారులు. రానున్న రోజుల్లో దేశంలో నెయ్యి, వంటనూనెల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. బ్యాంకులు నిత్యావసరాల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ)లను విడుదల చేయకపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుందని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

20 నుంచి 30 రోజుల్లో దేశంలో పెద్ద ఎత్తున వంటనూనెల సంక్షోభం ఏర్పడుతుందని తెలుస్తోంది. ఓడరేవుల్లో ఉన్న నిత్యావసర వస్తువుల పత్రాలను క్లియర్ చేయడంలో అక్కడి బ్యాంకులు విఫలం అవుతున్నాయని ట్రేడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ రెహాన్ తెలిపారు. పరిస్థితి చేయిదాటిపోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో వంట గ్యాస్ సంక్షోభం కూడా పాకిస్తాన్ లో ఏర్పడే అవకాశం ఉంది.

Read Also: Madhya Pradesh: “ఇస్లాం నగర్” పేరును జగదీష్‌పూర్‌గా మార్చిన ప్రభుత్వం..

మరోవైపు పాకిస్తాన్ రూపాయి రోజురోజుకు నేల చూపులు చూస్తోంది. డాలర్ తో పోలిస్తే పాక్ రూపాయి భారీగా పతనం అయింది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలు కేవలం మూడు వారాలకు అవసరమ్యే దిగుమతులకు మాత్రమే సరిపోయేంతగా ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ కు ఏ దేశం నుంచి అప్పు పుట్టడం లేదు. దీంతో ఐఎంఎఫ్ ను ఆశ్రయించింది. బెయిలౌట్ ప్యాకేజీని పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఐఎంఎఫ్ పాక్ పవర్ టారిఫ్ పెంచాలని సూచిస్తోంది. ఇదే జరిగితే అక్కడ ద్రవ్యోల్భనం మరింతగా పెరుగుతుంది.

ఇప్పటికే పెట్రోల్, డిజిల్ ధరలను లీటర్ కు రూ. 35 పెంచడంతో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదిరింది. కన్సూమర్ ప్రైజ్ ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్ నెలలో 24.5 శాతం పెరిగింది. అర్బన్ కోర్ ద్రవ్యోల్భనం డిసెంబర్ నాటకిి 15.4 శాతం, గ్రామీణ ద్రవ్యోల్భనం 19.4 శాతానికి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్భనం ఏడాదిలో 42.9 శాతం, గత డిసెంబర్ లో 5 శాతం పెరిగింది.

Show comments