Site icon NTV Telugu

Anurag Thakur: మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు రండి.. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా..

Anurag Thakur

Anurag Thakur

Anurag Thakur: మణిపూర్‌లో జాతి హింసపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభన కొనసాగుతుండగా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం ఈ అంశంపై చర్చకు రావాలని ప్రతిపక్ష పార్టీలకు చేతులను జోడించి విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను రాజకీయం చేయవద్దని అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్షాలను కోరారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రతిపక్షాలు సోమవారం పార్లమెంట్‌లో ఉమ్మడి నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ అంశంపై చర్చకు ముందు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రధాని కాకుండా హోంమంత్రి అమిత్ షా మాట్లాడాలని ప్రభుత్వం పట్టుబట్టింది.

Also Read: Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు.. సురక్షితంగా బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్

బాధితులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా మహిళలపై అఘాయిత్యాలు బాధాకరమని, ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని మంత్రి అన్నారు. రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. “అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనే సభలో దీనిపై మంచి చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాము. చర్చ నుంచి ఎవరూ పారిపోవద్దు. చర్చ నుంచి పారిపోవద్దని ముకుళిత హస్తాలతో ప్రతిపక్షాలకు నా విన్నపం” అని అనురాగ్‌ ఠాకూర్ అన్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి అంశాలను రాజకీయం చేయవద్దని, పార్లమెంటులో చర్చకు రావాలన్నారు. మణిపూర్ సమస్యపై నిరసనల గురించి అడిగినప్పుడు అనురాగ్ ఠాకూర్ ఈ విధంగా స్పందించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమయ్యాయి. మణిపూర్‌లో జాతి హింసపై ఆందోళనల నేపథ్యంలో సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. ప్రత్యేకించి మే 4న చిత్రీకరించబడిన వీడియో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలను చిత్రీకరిస్తుంది. ఈ వీడియో గత వారం బయటపడింది.

Exit mobile version