NTV Telugu Site icon

Amelia Kerr Towel: టవల్‌తో బంతిని ఆపింది.. భారీ మూల్యం చెల్లించుకుంది! వీడియో వైరల్

Amelia Kerr Towel

Amelia Kerr Towel

Brisbane Heat penalized for five runs after Amelia Kerr caught the ball using a towel: క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్ వేసిన త్రోను టవల్ సాయంతో అందుకునే ప్రయత్నం చేసిన బౌలర్‌కు ఫీల్డ్ అంపైర్ షాక్ ఇచ్చాడు. టవల్‌తో బంతిని ఆపినందుకు 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. దాంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 5 పరుగులు వచ్చాయి. ఈ పెనాల్టీ పరుగులతో ఆ జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ ఘటన ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2023లో చోటు చేసుకుంది.

బీబీఎల్ 2023లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. బ్రిస్బేన్ హీట్ బౌలర్ అమెలియా కేర్ 10వ ఓవర్‌ వేసింది. ఈ ఓవర్ తొలి బంతిని గార్డ్‌నర్ లాంగాన్ దిశగా షాట్ ఆడగా.. అక్కడ ఉన్న ఫీల్డర్ బంతిని అందుకొని అమెలియాకు విసిరింది. వికెట్ల పక్కనే ఉన్న అమెలియా.. చేతిలో టవల్ సాయంతో బంతిని అందుకునే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన ఫీల్డ్ అంపైర్.. 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. అమెలియా తప్పిదంతో బ్రిస్బేన్ హీట్ జట్టుకు షాక్‌ తగిలింది.

అమెలియా కేర్ ఉద్దేశపూర్వకంగా టవల్ సాయంతో బంతిని అందుకోకున్నా.. నిబంధనలు అతిక్రమించడంతో అంపైర్ చర్యలు తీసుకున్నాడు. మైదానంలో బంతిని ఆటగాళ్లకు సంబంధించిన వస్తువులతో అడ్డుకున్నా లేదా వాటి వల్ల బంతి ఆగిపోయినా పెనాల్టీ విధిస్తారన్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్ హెల్మెట్ తాకిన సందర్భంలో పెనాల్టీలు వేసిన ఘటనలు ఉన్నా.. టవల్ కారణంగా పెనాల్టీ పడడం ఇదే మొదటిసారి. అయితే బంతిని తుడిచేందుకు అమెలియా టవల్‌ చేతులోకి తీసుకున్న సమయంలోనే ఫీల్డర్ బాల్ విసరడంతో ఆమె పెట్టుకోక తప్పలేదు.

Also Read: ICC Stop Clock: ఐసీసీ కీలక నిర్ణయం.. ఆలస్యం అయితే 5 పరుగుల పెనాల్టీ!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. అమెలియా కేర్ (64) హాఫ్ సెంచరీ చేసింది. లక్ష్య చేధనలో సిడ్నీ సిక్సర్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులు చేసి గెలుపొందింది. పెనాల్టీ రూపంలో వచ్చిన 5 పరుగులు సిడ్నీ జట్టుకు కలిసొచ్చాయి. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు రాకుంటే.. ఫలితం మరోలా ఉండేది. అమెలియా కేర్ తప్పిదం బ్రిస్బేన్ హీట్ టీమ్ ఓటమిని శాసించింది.