Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!

Amaravati 29 Villages Farmers

Amaravati 29 Villages Farmers

అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన 29 గ్రామాల రైతుల సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కిందిస్థాయి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నివాస స్థలాలను సైతం వ్యవసాయ భూములుగా చూపిస్తున్నారని.. దీనివల్ల గ్రామ కంఠాల పరిధిలోని తమ ఇళ్లకు ముప్పు పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. కట్ ఆఫ్ డేట్ ప్రకటించామంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిస్తున్న శ్రద్ధలో కొంతైనా రాజధాని రైతుల సమస్యలపై చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. సాధారణ రైతులమని, కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తాము కూడా కృషి చేశామని గుర్తుచేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చినా కమిషనర్ తమను కలవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నేరుగా స్పందించి 29 గ్రామాల రైతుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అమరావతి సీఆర్డీఏ కార్యాలయంలో 29 గ్రామాల రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.