మార్కెట్ లో మంచి ధర వస్తుండటంతో.. మిర్చి రైతుల పంట పండుతోంది. మిర్చికి ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది భిన్నంగా మిర్చి ధర పెరుగుతూ పోతోంది. గత నెలలో గుంటూరులో మిర్చి ధర రూ.32 వేలకు అమ్ముడుపోయి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. తాజా ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుల్లో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చికి భారీ ధర పలికింది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర క్వింటల్ కు రూ.66 వేలు పలికింది. మార్కెట్ చరిత్రలో టమాటా రకం మిర్చి ఆల్ టైం రికార్డ్ ధర నమోదు చేసుకుంది.
దీంతో మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అకాల వర్షాలు, వైరస్‌ల కారణంగా మిర్చి తోటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. అయితే.. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది కేవలం మూడు, నాలుగు క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. దీంతో.. దేశీ మిర్చికి చరిత్రలో లేని విధంగా భారీ ధర పలుకుతోంది. క్వింటాల్‌కు రూ.66 వేలు ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.