NTV Telugu Site icon

Pawan Kalyan: కీలక శాఖలన్నీ పవన్‌ కల్యాణ్‌కే.. డిప్యూటీ సీఎం సహా నాలుగు శాఖలు..

Pawan

Pawan

Pawan Kalyan: ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రులుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ సహా 24 మంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల కేటాయింపుపై ఉత్కంఠే కొనసాగింది.. సీఎం చంద్రబాబు శాఖల కేటాయింపుపై కసరత్తు పూర్తి చేశారు.. కాసేపట్లో ప్రకటన అంటూ.. రెండు రోజుల నుంచి ప్రచారం సాగుతూ రాగా.. చివరకు ఈ రోజు మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం చంద్రబాబు.. కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.. సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను తన వద్దే ఉంచుకున్నారు ఏపీ సీఎం.. అయితే, ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కీలక శాఖలు దక్కాయి.. డిప్యూటీ సీఎం పదవితో పాటు.. ఆయనకు నాలుగు శాఖలు అప్పగించారు.. కీలకమైన పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ – పర్యావరణ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖకు అప్పజెప్పారు.

Read Also: AP Cabinet: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖంటే?

మరోవైపు.. జనసేన పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా కీలక శాఖలే దక్కాయి.. మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలశాఖ, వినియోగదారుల వ్యవహారాలు అప్పగించారు.. అలాగే మంత్రి కందుల దుర్గేష్‌ కు పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించారు సీఎం చంద్రబాబు నాయుడు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం వెనుక కీలక భూమిక పోషించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.. ఇక, కూటమి నేతలు.. తమకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు.. రెండు పార్లమెంట్‌ స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశారు పవన్‌ కల్యాణ్‌.. దీంతో.. ఒక్కసారిగా అందరి కళ్లు పవన్‌ కల్యాణ్‌ వైపే తిరిగాయి.. ఈ తరుణంలో ప్రభుత్వంతో చేరడంతో పాటు.. కీలక శాఖలు దక్కించుకున్నారు జనసేనాని.