All Quiet:’బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్’ (బి.ఎఫ్.టి.ఎఫ్.ఏ) అవార్డులకు ‘బ్రిటన్ ఆస్కార్స్’ అనే పేరుంది. ఇక్కడ విజేతలుగా నిలచిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రభావం అమెరికాలో జరిగే ‘అకాడమీ అవార్డులు’ (ఆస్కార్ అవార్డ్స్)పై కూడా ఉంటుందని సినీ ఫ్యాన్స్ విశ్వసిస్తారు. బీఎఫ్.టిఎఫ్.ఏ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 19న జరిగింది. ఈ అవార్డుల్లో ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల లాగే బ్రిటన్, అమెరికా దేశాల్లో రూపొందే చిత్రాలకే ప్రాధాన్యం ఉండేది. కానీ, రాను రాను మార్పులు చోటు చేసుకున్నాయి. ‘ఔట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిలిమ్’, ‘ఔట్ స్టాండింగ్ డెబ్యూ ఆఫ్ ఏ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్’, ‘బెస్ట్ బ్రిటిష్ షార్ట్ ఫిలిమ్’, ‘బెస్ట్ బ్రిటిష్ షార్ట్ యానిమేషన్’ వంటి అవార్డులు మినహా మిగిలిన కేటగిరీల్లో ఏ సినిమా అయినా పోటీ పడవచ్చు. అయితే సదరు చిత్రంలో ఎక్కడో ఒక చోట బ్రిటన్ లో ప్రదర్శితమై ఉండాలి. ఇక ‘నాన్ ఇంగ్లిష్ మూవీ’ అనే విభాగం ఉంది. ఇది ఆస్కార్ అవార్డుల్లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ’ కేటగిరీ లాంటిదే. ఇందులో కూడా పలు దేశాల చిత్రాలు పోటీ పడవచ్చు.
ఆస్కార్ అవార్డుల బరిలోనే కాదు, బ్రిటిష్ అకాడమీ అవార్డుల్లోనూ ‘బిగ్ ఫైవ్’ గాభావించే అవార్డులు – బెస్ట్ ఫిలిమ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ స్క్రీన్ ప్లే కు చెందినవే! 2023 బ్రిటిష్ అకాడమీ అవార్డుల్లో ఈ విభాగాల్లో బెస్ట్ ఫిలిమ్ గా ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ విజేతగా నిలచింది. ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డును సైతం ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ దర్శకుడు ఎడ్వర్డ్ బెర్గర్ సొంతం చేసుకున్నారు. ‘బెస్ట్ యాక్టర్’ గా ‘ఎల్విస్’ చిత్రంలో నటించిన ఆస్టిన్ బట్లర్ విజేతగా నిలిచారు. ఇక ‘బెస్ట్ యాక్ట్రెస్’ గా ‘తార్’లో నటించిన కేట్ బ్లాంచెట్ ఎన్నికయ్యారు. ఇక ‘బెస్ట్ స్క్రీన్ ప్లే ‘ విభాగంలో రెండు అవార్డులు ఉన్నాయి. వాటిలో ఒకటి ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే’ – ఈ విభాగంలో ‘ద బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ ఆంగ్ల చిత్రం ద్వారా మార్టిన్ మెక్డోనా విజేతగా నిలిచారు. ‘బెస్ట్ ఆడాప్డెడ్ స్క్రీన్ ప్లే’గా ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా రచయితలు ఎడ్వర్డ్ బెర్గర్, ఇయాన్ స్టాకెల్, లెస్లీ ప్యాటర్సన్ గెలుపొందారు.
బీఎఫ్.టి.ఎఫ్.ఏ. అవార్డుల్లో ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ 14 నామినేషన్లు సంపాదించింది. వాటిలో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే వంటి మూడు ప్రధానమైన అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. అలాగే ‘బెస్ట్ ఫిలిమ్ నాట్ ఇన్ ది ఇంగ్లిష్ లాంగ్వేజ్’ విభాగంలోనూ ఈ చిత్రం విజేతగా నిలచింది. అంటే బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఫారిన్ మూవీ రెండు అవార్డులనూ ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ సొంతం చేసుకుందన్న మాట! ఇవి కాక మరో మూడు విభాగాల్లోనూ ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ విజేతగా నిలచింది. వెరసి మొత్తం ఏడు బ్రిటిష్ అకాడమీ అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. దీని తరువాత ఆంగ్ల చిత్రం ‘ద బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేతో పాటు ఔట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిలిమ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డులనూ చేజిక్కించుకుంది.
విశేషమేమిటంటే, మార్చి మొదటివారంలో జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’కు గట్టి పోటీ ఇస్తోన్న ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ సినిమా బ్రిటన్ అకాడమీ అవార్డుల్లో కేవలం ‘బెస్ట్ ఎడిటింగ్’ను మాత్రమే సాధించగలిగింది. ఆస్కార్ అవార్డులపై ఈ బ్రిటిష్ అకాడమీ అవార్డుల ప్రభావం ఎంతయినా ఉంటుందని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. మరి అక్కడ కూడా ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ తన సత్తా చాటుకుంటుందేమో చూడాలి.