Site icon NTV Telugu

Pakistan: పోలీస్‌ స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్న ఉగ్రవాద ఖైదీలు హతం.. బందీలు విడుదల

Pakistan

Pakistan

Pakistan: వారాంతంలో పాకిస్తాన్ పోలీసు స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్న 33 మంది అనుమానిత ఉగ్రవాద ఖైదీలు మంగళవారం ప్రత్యేక దళాల క్లియరెన్స్ ఆపరేషన్‌లో మరణించారని, వారి బందీలను విడిపించారని రక్షణ మంత్రి తెలిపారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)తో సహా వివిధ తీవ్రవాద గ్రూపులకు చెందిన వారిగా అనుమానించబడిన ఉగ్రవాద ఖైదీలు ఆదివారం నాడు వారి జైలర్లను అధిగమించి ఆయుధాలను లాక్కున్నారు. జైలులోని ఖైదీలు, పోలీసులను బందీలుగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ అనంతరం బందీలుగా ఉన్న వారందరికీ విముక్తి లభించిందని రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ పార్లమెంటుకు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఒక అధికారితో పాటు ప్రత్యేక దళాల్లోని 15 మంది గాయపడ్డారని.. ఇద్దరు అమరులయ్యారని చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం దళాలు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఉగ్రవాద ఖైదీలను మట్టుబెట్టినట్లు చెప్పారు.

పోలీస్ స్టేషన్ బన్నూలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంది. ఇది గతంలో పాకిస్తాన్ స్వయం పాలనలో ఉన్న గిరిజన ప్రాంతాలకు ఆనుకుని, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. కార్యాలయాలు, రహదారులను మూసివేసి ఆ ప్రాంతం చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మరిన్ని కిడ్నాప్‌లు జరుగుతాయనే భయంతో మంగళవారం స్థానిక పాఠశాలలను కూడా మూసివేయాలని ఆదేశించినట్లు సంఘటనా స్థలంలో ఉన్న సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. బందీలను విడుదల చేయడంలో సహాయం చేయవలసిందిగా పాక్ అధికారులు కాబూల్‌లోని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ప్రత్యేక దళాలు భారీ ప్రాణనష్టాన్ని చవిచూశాయని, పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించలేకపోయారని ఓ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఇటీవల పాకిస్తాన్‌లో తాలిబన్ మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కౌంటర్-టెర్రరిజం సెంటర్ (ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం)పై దాడి చేసి.. దాన్ని నిర్బంధించారు. అందులో ఉన్న 9 మంది భద్రతా సిబ్బందిని సైతం బంధించి, ఆ కేంద్రాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే.. ఇంతకుముందు అరెస్ట్ చేసిన కొందరు తాలిబన్ మిలిటెంట్లలోని ఒక ఉగ్రవాదిని ఆదివారం ఆ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రంలోని కంటోన్మెంట్‌లో అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అతడు ఒక అధికారి నుంచి ఏకే-47 లాక్కొని.. కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు మృతి చెందారు. అనంతరం.. ఇతర ఉగ్రవాదుల్ని కూడా విడిపించి, ఆ కేంద్రాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు.

New UK Currency: కింగ్ చార్లెస్‌ ఫోటోతో కొత్త యూకే కరెన్సీ నోట్లు

అనంతరం ఆ తాలిబన్ మిలిటెంట్లు ఒక వీడియో విడుదల చేశారు. ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం తమ నియంత్రణలో ఉందని, 9 మంది సిబ్బందిని సైతం తాము బంధించామని ఆ వీడియోలో పేర్కొన్నారు. వాళ్లను విడిచిపెట్టాలంటే, తమను క్షేమంగా దేశం దాటించి, ఆఫ్ఘనిస్తాన్ చేరేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకోసం ఒక హెలికాప్టర్ సిద్ధం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ ఉగ్రదాడి గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. తాలిబన్ల చెర నుంచి అధికారుల్ని విడిపించేందుకు ప్రయత్నించి.. ప్రాణాలకు తెగించి ఆ ఉగ్రవాదులను హతమార్చారు. ఆదివారం నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

Exit mobile version