NTV Telugu Site icon

నాన్ వెజ్ ప్రియులకు షాక్‌..మరో కొత్త వ్యాధి !

మీరు మటన్‌ ప్రియులా. అయితే తస్మాత్‌ జాగ్రత్త. తాజాగా గొర్రెలకు అంత్రాక్స్‌ వ్యాధి సోకుతుండటంతో… నాన్ వెజ్‌ ప్రియులు అలర్ట్‌గా ఉండాల్సిందే. ఇన్ని రోజులు మాంసం ప్రియులను బర్డ్‌ ఫ్లూ వణికించగా.. ఇప్పుడు ఆంత్రాక్స్‌ కలవరపెడుతోంది. అంత్రాక్స్‌ సోకిన గొర్రె మాంసంతో వండిన మటన్‌ తిన్నారో.. మీకూ రోగాలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. తెలంగాణ వ్యాప్తంగా ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం రేపుతోంది. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో ఇటీవల నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్‌ వ్యాధితో మృత్యువాతపడ్డాయి. దీంతో అలర్టైన ఆరోగ్యశాఖ.. చుట్టుపక్కల ఊర్లో గొర్రెలు, మేకలకు టీకాలు వేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాలు లేకపోయినా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.హైదరాబాద్‌లోని మేకలమండికి తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచే కాకుండా… ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు, పొట్టేల్లు వస్తుంటాయి. అక్కడ నుంచి హోటళ్లు, రెస్టారెంట్లకు మాంసం సప్లై అవుతుంది. ఎక్కువ శాతం మేక మాంసంతోపాటు.. గొర్రె మాంసం కూడా హోటళ్లు, రెస్టారెంట్లలోని మటన్‌ లో ఉంటుంది. ప్రస్తుత తరుణంలో… మటన్‌ తినాలనుకునే వాళ్లు అలర్ట్‌గా ఉండాలంటున్నారు డాక్టర్లు. మటన్‌ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించకతప్పడం లేదు. గొర్రెలు, లేదా మేకలను కోసే ప్రాంతానికి వెళ్లి మటన్‌ తెచ్చుకునే వాళ్లు… జీవాలను కోసేటప్పుడే గమనించాలంటున్నారు.

వాటిని కోసినప్పుడు వెలువడే రక్తం వెంటనే గడ్డకట్టకుండా… ద్రవ రూపంలోనే ఉంటే వాటికి ఆంత్రాక్స్‌ సోకినట్లు గుర్తించాలంటున్నారు. ఆంత్రాక్స్‌ సోకిన గొర్రెలు, మేకల మాంసాన్ని తినడమే కాదు.. తాకడం కూడా ప్రమాదమే అంటున్నారు. ఆంత్రాక్స్ సోకిన జీవాలను అమ్మవద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఒకసారి ఒక ప్రాంతంలో ఆంత్రాక్స్‌ వ్యాపిస్తే… దాని ఎఫెక్ట్‌ 60 ఏళ్ల పాటు ఉంటుందని అంటున్నారు వైద్యులు. ఆంత్రాక్స్‌ తో చనిపోయిన జీవాల కళేబరాలను పూడ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వాటిని పూడ్చేటప్పుడు… సున్నం చల్లి పూడ్చాలంటున్నారు. లేకపోతే… వాటిని పూడ్చిన పరిసరాల్లో గడ్డి, నీరు, గాలి ద్వారా మనుషులకు కూడా సోకే ప్రమాదముందంటున్నారు. ముఖ్యంగా 100 డిగ్రీల ఊష్ణోగ్రతపైనే ఉడికించిన మాంసాన్ని తినాలని సూచిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ వచ్చిందని చికెన్‌ తినడం మానేసి మటన్‌ కు అలవాటు పడితే… ఇప్పుడు ఆంత్రాక్స్‌ వచ్చి మటన్‌ కు కూడా దూరం చేసింది అంటూ ఆవేదన చెందుతున్న మాంసంప్రియులు కూడా ఉన్నారు.ఎందుకైనా మంచింది కొన్నిరోజులపాటు నాన్‌ వెజ్‌ తినకపోవడమే బెటర్‌ అనుకుంటున్నవారు మరికొందరు. ఇదిలా ఉంటే… ఈ ఎఫెక్ట్‌ తోనైనా చుక్కలనంటిన మాంసం ధరలు దిగివస్తే బాగుండు అనుకునే మధ్యతరగతి జీవులు కూడా ఉన్నారు.