Site icon NTV Telugu

Alcohol Addiction: పైసా సంపాదన ఉండదు.. రాత్రి లేదు పగలు లేదు.. నిత్యం చుక్క పడాల్సిందే

Be Alert

Be Alert

Alcohol Addiction: మద్యం.. మనుషులను కిరాతకులుగా మార్చేస్తోంది. కొంత మందికి మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. సొంతవాళ్లు.. పరాయి వాళ్లు అని తేడా లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో మద్యం మత్తులో సొంత వారినే ఇద్దరు వ్యక్తులు కడతేర్చారు. కేవలం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా ఇద్దరి ఉసురు తీశారు. రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి.

అలాంటి వారు మద్యం కొనాలంటే డబ్బు కోసం అయిన వాళ్లను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారు. తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే.. సొంతవాళ్లను కూడా చంపేసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. సరిగ్గా రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి.

Telangana BJP Meeting: నేడు బీజేపీ పదాధికారుల భేటీ.. టీబీజేపీ దిశానిర్దేశం

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో ఐలమ్మ అనే మహిళ కొడుకు శ్రీకాంత్‌తో నివాసం ఉంటోంది. కొడుకు శ్రీకాంత్ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. రోజంతా తిరగడం తప్ప ఏ పనీ చేయడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని ఆమెను నిత్యం వేధిస్తున్నాడు. ఐతే కూలి పని చేసుకునే ఐలమ్మ.. నిత్యం కొడుకుకు మద్యం డబ్బులు ఇవ్వలేక సతమతమవుతోంది. ఉన్నదంతా మద్యానికే ఖర్చు చేస్తే ఏం తినాలని కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో తల్లితో ఘర్షణ పడ్డ శ్రీకాంత్.. ఆమెపై దాడి చేశాడు. మద్యం మత్తులో సుత్తితో ఆమె తలపై మోదాడు. కానీ అప్పటికీ ఆగ్రహం చల్లారలేదు. ఓ పదునైన సీకుతో ఆమె మెడపై పొడిచాడు. ఆమె అరుపులతో ఇరుగు పొరుగు వారు రావడంతో శ్రీకాంత్ అక్కడి నుంచి పారిపోయాడు. మరోవైపు ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు.

Vijayawada Horror: విజయవాడలో దారుణం: వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికిన అక్క కొడుకు

ఇక ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సకినవీడులో జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని అమ్మమ్మ పద్మావతిని కడతేర్చాడు మనవడు సాయితేజ. కూతురు, అల్లుడు అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో మనవడు సాయితేజను తానే పెంచి పెద్ద చేసింది పద్మావతి. డిగ్రీ వరకు చదివించింది. కానీ ఎలాంటి ఉద్యోగం చేయకుండా బలాదూర్ తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవాడు. కానీ ఈ మధ్య మద్యానికి బానిసయ్యాడు. ఐతే నిత్యం తాగి వస్తున్నాడని మనవడికి డబ్బులు కట్ చేసింది అమ్మమ్మ పద్మావతి. కానీ డబ్బు కోసం రోజూ వేధించడం మొదలు పెట్టాడు.

ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇంట్లో ఉన్న రాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండానే ఇద్దరు ప్రవర్తించారు. ఒకడు తల్లిని, మరొకడు అమ్మమ్మను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు.

Exit mobile version