Site icon NTV Telugu

Fastest Fifty: 6,6,6,6,6,6,6,6.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ, వరల్డ్ రికార్డు!

Akash Kumar Choudhary

Akash Kumar Choudhary

మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ బాదాడు. సూరత్‌లోని పితావాలా స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో ఆకాష్ 11 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇది రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కూడా. ఈ క్రమంలో వేన్ వైట్ రికార్డును ఆకాష్ బద్దలు కొట్టాడు.

2012లో ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ తరఫున ఆడిన వేన్ వైట్ 12 బంతుల్లోనే అర్ధ సెంచరీని సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును ఆకాష్ కుమార్ చౌదరి బ్రేక్ చేశాడు. అరుణాచల్ ప్రదేశ్‌ మ్యాచ్‌లో ఆకాశ్‌ 14 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆకాశ్‌ వరుసగా ఎనిమిది సిక్స్‌లు కొట్టాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదడం విశేషం. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో వరుసగా 8 సిక్స్‌లు బాదిన తొలి ప్లేయర్‌గా కూడా మరో రికార్డు సృష్టించాడు. ఆకాష్ 126వ ఓవర్‌లో లిమార్ డాబీ వేసిన ఆరు బంతుల్లోనూ సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న రెండు బంతుల్లో సిక్స్‌లు బాదాడు.

Also Read: Koti Deepotsavam 2025: కోటి రుద్రాక్షల అర్చన, జ్యోతిర్లింగ మహాపూజ.. కార్తీక సోమవారం నాటి కార్యక్రమాలు ఇవే!

ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో వరుసగా ఎనిమిది బంతుల్లో సిక్స్‌లు బాదిన మొదటి క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక ఆటగాడు ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టడం ఇది రెండోసారి. అంతకుముందు 1984-85లో తిలక్ రాజ్‌ బౌలింగ్‌లో రవిశాస్త్రి ఆరు సిక్సులు బాదాడు. మొత్తం మీద ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక బ్యాట్స్‌మన్ ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టడం ఇది మూడోసారి. 25 ఏళ్ల ఆకాష్ ఇప్పటివరకు 31 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 28 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆల్ రౌండర్ అయిన ఆకాష్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మూడు హాఫ్ సెంచరీలతో 553 పరుగులు చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో బంతితో రాణించి 87 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో 203 పరుగులు, 37 వికెట్లు సాధించాడు. టీ20లలో 107 పరుగులు, 28 వికెట్లు పడగొట్టాడు.

Exit mobile version