NTV Telugu Site icon

Akasa Air Lines: ఆకాశ ఎయిర్ లైన్స్ మూసీవేత.. సీఈఓ ఏమన్నారంటే?

Akasa

Akasa

Akasa Air Lines Shutdown Rumors: బిగ్ బుల్, దివంగత వ్యాపారవేత్త రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేసిన ఆకాశ ఎయిర్ లైన్స్ కష్టాల్లో  ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీని మూసేస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత నెలలోనే ఏడాది పూర్తి చేసుకున్న ఎయిర్ లైన్స్ మొదటి వార్షికోత్సవం సంద్భంగా చాలా తక్కువ ధరకే టికెట్లు అందించింది. అయితే చివరి నిమిషంలో ఫ్లైట్లు రద్దు కావడంతో ఆ టికెట్ల డబ్బును వాపస్ చేశారు. ఇలా విమానాలు చివరి నిమిషంలో క్యాన్సిల్ కావడానికి కారణం పైలెట్లు సడెన్ గా రాజీనామా చేసి వెళ్లిపోవడమే అని తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలువురు పైలట్లు అకస్మాత్తుగా రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. అయితే వీరు కాంట్రాక్ట్ పిరియడ్ చేయకుండా సడెన్ గా వేరే కంపెనీలో చేరిపోయారు. దీని కారణంగా అనేక విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. జూనియర్ ట్రైనీ పైలెట్లు ఇలా చేసినట్లు తెలుస్తుంది.

Also Read: Tamilnaadu: తమిళనాడులో కలకలం.. నెల రోజుల్లో తొమ్మిది పెద్ద పులులు మృతి

ఈ నేపథ్యంలో కంపెనీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే తమకు పరిహారం చెల్లించాలని సడెన్ గా వెళ్లిపోయిన  43 మంది పైలెట్లపై కూడా ఆకాశ ఎయిర్ లైన్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆకాశ ఎయిర్ లైన్స్ ను మూసివేస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి. వీటిపై స్పందించిన సంస్థ సీఈఓ వినయ్ దూబే   పైలట్ల ఆకస్మిక రాజీనామాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే ఎయిర్ లైన్స్ మూసివేస్తున్నారన్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి పుకార్ల వల్ల తమ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని అలాంటిది ఏం లేదంటూ వారికి మెయిల్స్ కూడా పంపినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందుల పాలు కాకుండా ఉండేందుకు కార్యకలాపాలను తగ్గించుకున్నామని వెల్లడించిన ఆయన ఈ మేరకు మార్కెట్‌లో వాటాను స్వచ్ఛందంగా వదులుకున్నామని చెప్పుకొచ్చారు. సంస్థపై ప్రయాణీకులకు నమ్మకం కలిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినయ్ దూబే పేర్కొ్న్నారు.  కంపెనీ కచ్చితంగా సక్సెస్ అవుతుందని తాము గట్టిగా నమ్ముతున్నట్లు ఆయన వెల్లడించారు. తమ విధానాల కారణంగా సంస్థ ఆర్థికంగా బలంగా, భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతంగా అమలు అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక గతేడాది ప్రారంభమైన ఆకాశ ఎయిర్ లైన్స్ ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ వంటి 16 నగరాలను కలుపుతూ 35 ప్రత్యేక మార్గాల్లో ఆపరేట్ చేస్తోంది.