Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!

Ajith Kumar Fans Launch New Political Party

Ajith Kumar Fans Launch New Political Party

Ajith Kumar Fans Launch New Political Party in Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ అభిమానుల రాజకీయ వేదిక తెరపైకి వచ్చింది. ప్రముఖ నటుడు, తలా అజిత్ కుమార్‌ను ముందుకు తెచ్చి.. ఆయన అభిమానులు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కాంచీపురం జిల్లా కుంద్రత్తూరులో ‘అనైతు నన్బర్గళ్ మున్నేట్రక్ కళగం’ పేరుతో పార్టీని ప్రారంభించారు. అయితే ఈ రాజకీయ పార్టీకి అజిత్ కుమార్ స్వయంగా మద్దతు ఇచ్చినట్లు లేదా ఆయన ఇందులో చేరినట్లు ఎలాంటి నిర్ధారణ లేదు.

2031లో అజిత్‌ను సీఎం చేయడమే లక్ష్యం:
కుంద్రత్తూరులో జరిగిన పార్టీ తొలి సమావేశానికి తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి సుమారు 100 మంది అజిత్ అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అజిత్‌ను 2031లో తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలనేది తమ లక్ష్యమని పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. సమావేశం సందర్భంగా ‘రేపటి ముఖ్యమంత్రి.. పదవీ స్వీకరించేందుకు రా’ వంటి నినాదాలతో బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. అజిత్ ఫొటోకు అభిమానులు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు టి. బాబు పార్టీకి ‘కారు’ గుర్తును ప్రకటించారు. కొత్తగా నియమితులైన పార్టీ నిర్వాహకులకు గుర్తింపు కార్డులను కూడా అందజేశారు.

రైతులు, యువతే ప్రధాన అంశాలు:
పార్టీ ప్రకటించిన ప్రధాన అంశాల్లో మాదకద్రవ్యాల సమస్యను పరిష్కరించడం, నీట్‌ను రద్దు చేయడం, పట్టభద్రులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన వంటి అంశాలు ఉన్నాయి. రైతులకు షరతులు లేకుండా బ్యాంకు రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. అలాగే రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నెలకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

అజిత్ రాజకీయ ప్రవేశంపై అభిమానుల డిమాండ్:
అజిత్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానుల్లో కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కావడం తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. గతంలోనూ అజిత్ అభిమానులు రాజకీయ పార్టీ పేరుతో వేదికను ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 20న కళ్లకురిచి జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలో ‘తమిళగ మక్కల్ కళగం’ పేరుతో మరో అభిమానుల రాజకీయ పార్టీని ప్రారంభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే అజిత్ స్వయంగా రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే దానిపై ఆయన నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే తమిళ సినీ రంగానికి చెందిన పలువురు రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో.. అజిత్ అభిమానుల తాజా రాజకీయ ప్రయత్నం తమిళనాడులో కొత్త చర్చకు తెరతీసింది.