Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర మొత్తం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా మహారాష్ట్ర బారామతిలో కూలిన విమాన ప్రమాదం గురించి బయటకు వస్తున్న వివరాలు మరింత కలచివేస్తున్నాయి. ఆ ప్రమాదానికి క్షణాల ముందు కాక్‌పిట్‌లో ఉన్న ఇద్దరు పైలట్ల నోటి నుంచి వచ్చిన చివరి మాటలు అందరినీ వణికిస్తున్నాయి. “ఓహ్ షిట్” అన్న మాటలు వినిపించిన కొద్ది సెకన్లలోనే ఆ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న లియర్‌జెట్ 45 విమానం, బారామతి టేబుల్‌టాప్ రన్‌వేపై రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 66 ఏళ్ల అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సహాయకుడు, అలాగే విమానం నడిపిన ఇద్దరు పైలట్లైన సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శంభావి పాఠక్ అందరూ మృతి చెందారు.
READ MORE: US: భారత్-ఈయూ డీల్ నిరాశ పరిచింది.. మరోసారి అమెరికా కీలక వ్యాఖ్యలు
అయితే.. ఈ ప్రమాదంపై డీజీసీఏకు సంబంధించిన ఒక సీనియర్ అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి ముందు క్షణాల్లో కాక్‌పిట్ నుంచి “ఓహ్ షిట్” అనే మాటలు చివరి సారిగా వినిపించాయి. అదే సమయంలో బారామతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ పూర్తి స్థాయిలో లేదని వెల్లడైంది. అక్కడి గ్రౌండ్ కంట్రోల్‌ను రెడ్‌బర్డ్ ఏవియేషన్, కార్వర్ ఏవియేషన్ అనే రెండు ప్రైవేట్ ఫ్లయింగ్ అకాడమీలకు చెందిన పైలట్ శిక్షణార్థులే నిర్వహిస్తున్నారు. పైలట్లకు సమాచారాన్ని అందించిన చివరి కేంద్రం ఇదే. ఈ ఘోర ప్రమాదంపై లోతైన విచారణ కోసం విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ నుంచి ప్రత్యేక బృందం బుధవారం సాయంత్రం ప్రమాద స్థలానికి చేరుకుంది. ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభమైంది.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ ప్రమాదానికి దారి తీసిన సంఘటనల క్రమాన్ని వివరించారు. అందులో ఒక విషయం ఆందోళన కలిగిస్తోంది. ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత, పైలట్లు ఆ అనుమతిని తిరిగి చదివి నిర్ధారించలేదని పేర్కొన్నారు. సాధారణంగా ఇది తప్పనిసరి ప్రక్రియగా భావిస్తారు. ఉదయం 8:18 గంటలకు, VT-SSK రిజిస్ట్రేషన్ ఉన్న ఈ విమానం బారామతి విమానాశ్రయంతో మొదటిసారి సంప్రదింపులు ప్రారంభించింది. అప్పటికి పైలట్ సుమిత్ కపూర్‌కు 15 వేల గంటలకుపైగా విమాన అనుభవం ఉంది. సహ పైలట్ శంభావి పాఠక్‌కు దాదాపు 1,500 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. వారికి వాతావరణ పరిస్థితులు తెలియజేసి, తమ ఇష్టానుసారం ల్యాండ్ కావచ్చని చెప్పారు. పైలట్లు గాలి పరిస్థితి, దృష్టి ఎంత ఉందో అడిగారు. వారికి సుమారు మూడు కిలోమీటర్ల దృష్టి ఉందని తెలిపారు. ఇది సాధారణంగా ల్యాండింగ్‌కు సరిపడే స్థాయిగా పరిగణిస్తారు.
READ MORE: Plane Crash: 28 రోజుల తేడా.. ప్రాణాంతకంగా మారిందా?.. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై షాకింగ్ విషయాలు..
అంతకుముందు విమానం రన్‌వే 11 వైపు చివరి దశకు చేరుకుంది. కానీ వెంటనే పైలట్లు “రన్‌వే కనిపించడం లేదు” అని చెప్పారు. దీంతో సాధారణ విధానంగా ల్యాండింగ్ ప్రయత్నాన్ని ఆపి, మళ్లీ పైకి వెళ్లాలని సూచించారు. దీన్నే గో అరౌండ్ అంటారు. గో అరౌండ్ తర్వాత మళ్లీ విమానం తన స్థానం తెలిపింది. మరోసారి చివరి దశలో ఉందని చెప్పింది. ఈసారి రన్‌వే కనిపిస్తోందా అని అడిగితే, కనిపిస్తోందని పైలట్లు ధృవీకరించారు. దీంతో ఉదయం 8:43కి ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. కానీ కేవలం ఒక నిమిషం తర్వాత, అంటే 8:44కి, ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది రన్‌వే 11 ఎంట్రీ వద్ద మంటలు కనిపించాయని తెలిపారు. దీంతో విమానం కూలినట్లు నిర్ధారణకు వచ్చారు. అనుభవజ్ఞులైన పైలట్లు ఉన్నప్పటికీ ఎందుకు ఈ ప్రమాదం జరిగిందన్న ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
