NTV Telugu Site icon

Ajit Agarkar BCCI Chairman: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్.. కుర్రాళ్లపై ఫోకస్!

Ajit Agarkar

Ajit Agarkar

Ajit Agarkar named India Men’s Chairman of Selectors: అందరూ ఊహించినదే జరిగింది. టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా భారత మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ నియమితుడయ్యాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ అతడిని ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం ప్రకటించాడు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో ఈ పదవికి అగార్కర్‌ను ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. రెండు నెలల క్రితం భారత ఆరగాళ్లపై తీవ్ర ఆరోపణలు చేసిన చేతన్ శర్మ రాజీనామా చేయడంతో చీఫ్ సెలెక్టర్‌ పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే.

‘సులక్షణ నాయక్‌, అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరాంజపెలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ.. సెలక్షన్‌ కమిటీలో ఖాళీ అయిన ఒక స్థానానికి ఇంటర్వ్యూలు నిర్వహించింది. కమిటీ ఏకగ్రీవంగా అజిత్ అగార్కర్‌ను ఎంపిక చేసింది. మిగతా సెలక్టర్లతో పోలిస్తే.. ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉన్న అగార్కర్‌నే సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపాదించింది’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపాడు. సలీల్‌ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శరత్‌, ఎస్‌ఎస్‌ దాస్‌ కమిటీలోని ఇతర సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు అగార్కర్‌ కలిసి పనిచేయనున్నారు.

బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్‌లో అజిత్ అగార్కర్ సీనియర్‌ మోస్ట్ సభ్యుడిగా (Ajit Agarkar BCCI Chairman) చేరారు. ఈ ఏడాది చివరలో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ నియామకం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నెలలో వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌ కోసం జట్టును ఎంపిక చేయనుంది. అగార్కర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటినుంచే యువ జట్టును సిద్ధం చేయనున్నాడు. సీనియర్లను పక్కన పెట్టే అవకాశం ఉంది.

అజిత్ అగార్కర్‌ 1998-2007 మధ్య భారత్ తరఫున 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 288, 58, 3 వికెట్లు తీశాడు. 1999, 2003, 2007 వన్డే ప్రపంచకప్‌ల్లో భారత జట్టుకి అతడు సభ్యుడు. అగార్కర్‌ లార్డ్స్‌లో టెస్టు సెంచరీ చేసి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. భారత్‌ తరఫున వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు కూడా అగార్కర్‌దే. 2000లో జింబాబ్వేపై 21 బంతుల్లోనే 50 రన్స్ చేశాడు. రిటైర్మెంట్‌ అనంతరం అగార్కర్‌ క్రికెట్‌ విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.

Show comments