NTV Telugu Site icon

BCCI: బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో మార్పు.. మాజీ వికెట్ కీపర్ ఎంట్రీ!

Ajay Ratra

Ajay Ratra

టీమిండియా ఫురుషుల సెలెక్షన్ కమిటీలో కీలక మార్పు చోటు చేసుకుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీలో టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్‌ అజయ్‌ రాత్రా సరికొత్త సభ్యునిగా నియమితులయ్యారు. సలీల్ అంకోలా స్థానంలో అతడికి అవకాశం దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అగార్కర్, అంకోలా ఇద్దరూ వెస్ట్‌ జోన్‌కు చెందినవారే కావడంతో ఈ మార్పు చేయాల్సి వచ్చింది.

సంప్రదాయం ప్రకారం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీలో అయిదుగురు సభ్యులు వివిధ జోన్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. అజిత్ అగార్కర్, సలీల్ అంకోలా ఇద్దరూ వెస్ట్‌ జోన్‌కు చెందినవారే. దాంతో ఈ కీలక మార్పు చేయాల్సి వచ్చింది. అజయ్ రాత్రా నార్త్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, శ్రీథరన్ శరత్ సభ్యులుగా ఉన్నారు. ‘ఇది నాకు పెద్ద గౌరవం. ఓ సవాలు కూడా. భారత క్రికెట్‌కు సేవలందించడానికి ఉత్సాహంతో ఉన్నా’ అని రాత్రా పేర్కొన్నారు.

Also Read: Vijayawada Floods: వరద సహాయక చర్యల్లో పోలీస్‌ కమిషనర్‌.. 10 రోజుల పసి పాపను కాపాడిన సీపీ..

సెలక్టర్‌ పదవికి బీసీసీఐ గత జనవరిలో దరఖాస్తులు ఆహ్వానించింది. అజయ్ రాత్రాతో పాటు రితిందర్‌ సింగ్‌ సోధి, అజయ్‌ మెహ్రా, శక్తి సింగ్‌లకు కుదించిన జాబితాలో చోటు దక్కింది. అశోక్‌ మల్హోత్రా నేతృత్వంలోని క్రికెట్‌ సలహా సంఘం వీరిని ఇంటర్వ్యూ చేసింది. చివరకు రాత్రా ఎంపికయ్యారు. 42 ఏళ్ల రాత్రా భారత్ తరఫున 6 టెస్టులు, 12 వన్డేలు ఆడారు. హర్యానాకు చెందిన రాత్రా 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 4000 పరుగులు చేశారు. అస్సామ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ జట్లకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు.