అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఏఐ171 విమానం గురువారం (జూన్ 12) ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మృతి చెందారు. విమానం భవనంపై కుప్పకూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 265కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. లండన్‌లో స్థిరపడాలని బయల్దేరిన ఓ కుటుంబం మొత్తాన్ని విమాన ప్రమాదం బలిగొంది. విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 10 మంది మృతి చెందగా.. వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి కుటుంబ సభ్యులు అందరూ మృతి చెందారు. డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్.. వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనతో ప్రతీక్ జోషి కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది.
ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఓ నవ వధువు కూడా చనిపోయింది. రాజస్థాన్‌కు చెందిన ఖుష్బూకు గత జనవరిలో పెళ్లయింది. ఆమె భర్త లండన్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. లండన్ వెళ్లాక తొలిసారి భర్తను కలిసేందుకు ఖుష్బూ గురువారం బయలుదేరింది. విమాన ప్రమాదంలో ఖుష్బూ మరణింది. దీంతో ఖుష్బూ జాడ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లండన్‌లో ఉన్న భర్త శోకసముద్రంలో మునిగిపోయాడు.
