Air India order support US jobs: ఇప్పుడు.. సీన్ రివర్స్ అయింది. మనోళ్లకు అమెరికా ఉద్యోగాలివ్వటం కాదు. అమెరికన్లకే మనం ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకున్నాం. వినటానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది నిజం. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడే ఈ మాట అన్నాడు. కొత్త విమానాల కోసం ఎయిరిండియా సంస్థ తమ కంపెనీ బోయింగ్‌కి భారీ ఆర్డర్ ఇవ్వటం వల్ల యూఎస్‌లో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని ఆ దేశ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు.
ఎయిరిండియా-బోయింగ్ మధ్య కుదిరిన ఒప్పందం చారిత్రాత్మకమైందని ఆయన అభివర్ణించారు. 10 లక్షల మంది అమెరికా ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలన్న తన అజెండాకు ఈ హిస్టారిక్ డీల్ ఎంతో సపోర్ట్‌గా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. అగ్ర రాజ్యాన్ని సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్లటానికి సైతం ఇది ప్రోత్సాహకరంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.
read more: Renault, Nissan Vehicles: ఉమ్మడిగా వాహనాలను ఉత్పత్తి చేయనున్న రెనాల్ట్, నిస్సాన్
ఎయిరిండియా ఒప్పందం వల్ల అమెరికాలోని 44 రాష్ట్రాల్లోనూ వర్కింగ్ క్లాస్ పీపుల్‌కి మంచి ఉద్యోగాలు దొరుకుతాయని జో బైడెన్ చెప్పారు. వర్కింగ్ క్లాస్ పీపుల్‌కి మంచి వేతనాలిచ్చే పారిశ్రామిక ప్రాజెక్టులను రప్పించటం కోసం అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా పాటుపడుతున్నారు. దేశ తయారీ రంగానికి ఊతంగా నిలవాలని భావిస్తున్నారు. కానీ.. పెద్ద ప్రాజెక్టులు విదేశాలకు తరలిపోతున్నాయని, వాటివల్ల ముఖ్యంగా చైనా లాభపడుతోందనే విమర్శలు ప్రస్తుతం అమెరికాలో వినిపిస్తున్నాయి.
దీంతోపాటు వచ్చే ఏడాది అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిరిండియా.. బోయింగ్‌కి ఆర్డర్ ఇవ్వటం, దానిపై బైడెన్ ఇలా స్పందించటం ప్రాధాన్యత సంతరించుకుంది. మన దేశస్తులు ఎక్కువ శాతం అమెరికా వెళ్లి.. అక్కడివాళ్ల అవకాశాలకు గండికొడుతున్నారనే విమర్శలకు కూడా ఈ ఒప్పందం ఫుల్ స్టాప్ పెడుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.