పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొన్న నేపథ్యంలో ఎయిరిండియా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇరాన్ గగనతలం మీదుగా రాకపోకలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఆదివారంలోపు డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతుందన్న అంచనాల నేపథ్యంలో పశ్చిమాసియాలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎయిరిండియా సర్వీసులు నిలిపివేసినట్లు సమాాచారం.
గత కొద్ది నెలలుగా ఇజ్రాయెల్-గాజా మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో తమ సీనియర్ కమాండర్లు మృతి చెందినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ వెల్లడించింది. ఇది బెంజమిన్ నెతన్యాహూ సేనల పనేనని, ఈ నేరానికి వారు పశ్చాత్తాపపడేలా చేస్తామని ఇరాన్ నేత అయతుల్లా అలీ ఖొమేనీ హెచ్చరించారు. అప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్-ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు అటువైపు ప్రయాణం చేయవద్దని మన పౌరులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. ప్రస్తుతం ఆ రెండు దేశాల్లో ఉంటున్న వారు స్థానిక భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది. మరోవైపు ఇజ్రాయెల్‌ను అమెరికా అప్రమత్తం చేస్తూనే.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి భరోసా ఇచ్చారు. ఇరాన్ ఏ క్షణంలోనే దాడులకు పాల్పడొచ్చని.. అందుకు సిద్ధంగా ఉండాలని అలర్ట్ చేసింది. మరోవైపు జర్మన్ సహా పలు దేశాలు ఇప్పటికే విమాన సర్వీసులను రద్దు చేశాయి.