Air India: వాణిజ్య విమానయాన చరిత్రలో ఎయిరిండియా సరికొత్త అధ్యాయం లిఖిస్తోంది. ఫ్రాన్స్ సంస్థ ఎయిర్‌బస్‌తోపాటు అమెరికా కంపెనీ బోయింగ్‌తో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండింటి నుంచి 500లకు పైగా కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. తద్వారా భారతదేశ విమానయాన రంగంలో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఎయిరిండియా ఆశిస్తోంది.
అదే సమయంలో.. లోకల్ లో-కాస్ట్ ప్రత్యర్థి సంస్థలను మరియు ఎమిరేట్స్ వంటి పవర్‌ఫుల్ గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ను ధీటుగా ఢీకొట్టబోతోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలనే సూత్రాన్ని సమర్థవంతంగా అమలుచేయనుంది. ఎయిర్‌బస్ నుంచి దాదాపు 250 విమానాలను తెప్పించుకుంటుంది. బోయింగ్ నుంచి సుమారు 220 విమానాలను కొనేందుకు ఆర్డర్ ఇచ్చింది. ఒప్పందం వివరాలను మంగళవారం అధికారికంగా వెల్లడించారు.
read more: Aero India 2023: ఏరో ఇండియా థీమ్ ఇదే
పేరెంట్ కంపెనీ టాటా చేతికి గతేడాది తిరిగొచ్చిన ఎయిరిండియా భారీ విస్తరణ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ను, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎయిరిండియా ప్రభుత్వ సంస్థగా ఉన్నప్పుడు చివరిసారిగా 16 ఏళ్ల క్రితం 111 కొత్త విమానాలు కొనుగోలు చేసింది. అప్పుడూ ఈ 2 సంస్థలకే.. అంటే.. ఎయిర్‌బస్ మరియు బోయింగ్‌లకే ఆర్డర్లు ఇవ్వటం ఆసక్తికరం.