అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక విచారణ జరిగాక నివేదిక వస్తుందని అందరూ ఆశించారు. అందులోనే ప్రమాదానికి కారణమేంటో కూడా తేలిపోతుందని భావించారు. కానీ విచారణ నివేదికలో కొన్ని అంశాలు ముందే లీకయ్యాయి. ఈ అంశం మరిన్ని చిక్కుముడులకు తావిచ్చింది.
ఎక్కడైనా విమాన ప్రమాదం జరిగాక.. అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుంది. తుది నివేదిక బయటపడేదాకా.. విచారణ జరుగుతున్న తీరును అతి రహస్యంగా ఉంచుతారు. ఎక్కడా విచారణాంశాలు లీకవ్వకుండా జాగ్రత్తపడతారు. మానవ తప్పిదాలు, సాంకేతిక కారణాలు, అనుకోని ఘటనలు.. ఇలా ప్రతి కోణంలోనూ సమగ్రంగా దర్యాప్తు చేసి.. అసలు కారణమేంటో తేలుస్తారు. అలాగే ఆ కారణానికి తగినన్ని ఆధారాలను కూడా నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది. కానీ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత విచారణ మాత్రం మొదట్నుంచీ గందరగోళ పద్ధతుల్లోనే సాగుతోంది. ఇక్కడ విచారణ కంటే.. చర్చే ఎక్కువగా ఉంది. పైగా దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని దుర్ఘటన కావడంతో.. అసలు కారణమేంటో త్వరగా తేల్చాలనే ఒత్తిడి కూడా చాలా ఉంది. ఇక డ్రీమ్ లైనర్ డిజైన్లపై విమర్శలు, బోయింగ్ కంపెనీలో విమానాల తయారీ లోపాలపై ఆరోపణల మధ్యే విచారణ ప్రారంభమైంది. దేశంలో నిపుణులతో పాటు అమెరికా నుంచి కూడా నిపుణులు వచ్చి ప్రమాదంపై విచారణ జరిపారు. దీంతో మరింత పక్కాగా కారణాలు వెలుగుచూస్తాయని బాధితులు ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలు చేస్తూ.. నివేదిక బయటపెట్టకముందే.. అందులో కొన్ని అంశాలు లీక్ కావడం దుమారం రేపుతోంది. ఆ లీకైంది కూడా విదేశీ మీడియాలో రావడం.. మరిన్ని కొత్త ప్రశ్నలకు అవకాశం ఇచ్చింది. అసలు ఇండియాలో విచారణ జరుగుతుంటే.. అమెరికా మీడియాకు ఎవరు సమాచారమిచ్చారని గగ్గోలు రేగింది. కాక్ పిట్ వాయిస్ ను ఉద్దేశపూర్వకంగా బయటకు వదిలారని, అదీ సెలక్టెడ్ పోర్షన్స్ ను మాత్రమే లీక్ చేయడం ఏంటని పైలట్ల అసోసియేషన్ తీవ్రంగా మండిపడింది. దీంతో స్పందించిన కేంద్రం.. తుది నివేదిక వచ్చాక.. దాని పరిశీలనకు పైలట్ల కమిటీకి అవకాశమిస్తామని తెలిపింది. అసలు నివేదిక ఇంకా రాలేదని, అప్పుడే తొందరపడి ఏ నిర్థారణకూ రాలేమని కూడా తేల్చిచెప్పింది.
విమానం టేకాఫ్ కు ముందు నుంచి.. కూలిపోయే వరకు పైలట్ల సంభాషణలు రికార్డయితే కేవలం ఒకటి, రెండు వాక్యాలు మాత్రమే పొడిపొడిగా దర్యాప్తులో ప్రస్తావించడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ వాక్యాలు కూడా పైలట్ల స్రత్పవర్తనను ప్రశ్నించేలా, వారి అంకితభావంపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ఫ్యూయల్ స్విచ్‌ను ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్‌ను మరో పైలట్ అడగటం చూస్తుంటే మొదటి పైలట్ ఉద్దేశపూర్వకంగానే స్విచాఫ్ చేశాడనే అనుమానం రేకెత్తుతోంది. అయితే తాను స్విచాఫ్ చేయలేదని అతని కరాఖండీగా చెప్పడం, వెనువెంటనే ఇద్దరూ స్విచ్ ఆన్‌కు ప్రయత్నించడం చూస్తుంటే ఆ స్విచ్‌లలోనే ఏవైనా మెకానిక్, ఎలక్ట్రిక్ లోపాలు ఉండొచ్చనే అనుమానాలూ బలపడుతున్నాయి. అయితే స్విచింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయో లేదో ప్రాథమిక నివేదికలో పేర్కొనకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అయితే స్విచాఫ్ చేయడాన్ని గమనించి పైలట్ ఇంకొరిని ప్రశ్నించాడా ? అనేది తేలాల్సి ఉంది. అయితే ఫ్యూయల్ స్విచ్‌ను ఎందుకు ఆఫ్ చేశావని ప్రశ్నించిన పైలట్ పేరును నివేదికలో బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేంటని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైలట్‌ల పూర్వచరిత్రపై కూపీలాగేందుకు, ఆ దిశగా దర్యాప్తు సజావుగా సాగాలని ఉద్దేశంతోనే వాళ్ల ఐడెంటిటీనీ ప్రభుత్వం బయటపెట్టలేదనే వాదనను అంతర్జాతీయ మీడియా తెరమీదకు తెచ్చింది.
కనీసం పైలట్ వాయిస్ రికార్డింగ్ అయినా మొత్తంగా లీకయ్యుంటే అదో పద్ధతి. కానీ ఇక్కడ ఎంపిక చేసిన కొన్ని మాటల్ని మాత్రమే ఎందుకు బయటపెట్టారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. అలాగే విమానంలో మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యల గురించి ఎక్కడా ఎలాంటి లీకేజీ లేదు. ఫ్యూయల్ స్విచ్‌లు ఆఫ్ అయ్యాయని మాత్రమే ప్రస్తావించి అక్కడితో లీకులు ముగిశాయి. కానీ ప్రజల్లో మాత్రం కొత్త ప్రశ్నల పరంపరకు పరోక్షంగా నాంది పలికింది. స్విచ్‌లను పొరపాటున ఆఫ్ చేశారా? లేదంటే స్విచింగ్ లోపాలా అనేది నివేదిక స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో అసలు కారణం ఏమిటనే మిస్టరీ అలాగే మిగిలిపోయింది.
విమానం సెకన్ల వ్యవధిలో నేలకూలడానికి మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యలే కారణమై ఉంటాయని పలువురు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కడే పైలట్ ఈ రెండు ఫ్యూయల్ స్విచ్‌లను ఒకేసారి ఆఫ్ చేయడం అసాధ్యమనే వాదన వినిపిస్తోంది. అలాగని ఫ్యూయల్ స్విచ్‌లను పొరపాటున ఆన్, ఆఫ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. వీటికి లీవర్ లాక్‌లు ఉంటాయని చెబుతున్నారు. స్విచ్‌ను ఆన్, ఆఫ్ చేయాలంటే మొదటగా అక్కడున్న లీవర్‌ను పైకి లాగాల్సి ఉంటుంది. 1950వ దశకం నుంచే ఈ సెక్యూరిటీ ఫీచర్ ఉంది. ఇవికాకుండా ప్రొటెక్టివ్ గార్డ్ బ్రాకెట్స్ కూడా ఉంటాయి. పొరపాటున స్విచ్‌లు ఆన్,ఆఫ్ కాకుండా వాటిని ఈ బ్రాకెట్లు నిరోధిస్తాయి. ఈ లెక్కన ఒక్క చేతితో రెండు స్విచ్‌ల లీవర్‌లను ఒకేసారి పైకిలాగడం అసాధ్యం. పొరపాటున లాగారని భావించినా ఒకేసారి రెండింటినీ ఎవరూ లాగరు. ఈ లెక్కన వాటి పొజిషన్‌ను మార్చకపోయినా మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యల కారణంగా వాటి పొజిషన్ మారి ఉండొచ్చనే అనే అంచనాలు లేకపోలేదు. పైలట్ల పరస్పర మాటలు, వాగ్వాదం లాంటివి వినగల్గితే స్విఛ్‌లు ఆఫ్ కావడం అనేది మానవతప్పిదమా? ఉద్దేశపూర్వకమా? లేదంటే అవి పాడైపోవడంతో పనిచేయడం మానేశాయా? అనేవి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ అలా జరగాలంటే.. మొదట కాక్ పిట్ వాయిస్ మొత్తం బయటకు రావాలి.
బోయింగ్ డ్రీమ్ లైనర్ 737 విమానాల్లో అమర్చిన ఫ్యూయల్ స్విచ్‌లకు లాకింగ్ వ్యవస్థ సరిగా అనుసంధానం కాలేదన్న అంశం కూడా ఇప్పుడు వెలుగుచూస్తోంది. అమెరికాలోని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ స్పెషల్ ఎయిర్‌వర్తీ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను 2018 డిసెంబర్‌లో విడుదలచేసింది. అందులో బోయింగ్ 737లోని ఫ్యూయల్ స్విచ్‌లతో లాకింగ్ ఫీచర్ సరిగా అనుసంధానం కావట్లేదని, అత్యవసర సమయాల్లో పనిచేయకపోవచ్చని, ఎప్పటికప్పుడు చెక్‌చేసుకుంటే మంచిదని సంస్థ తన అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఈ సిఫార్సును ఏ విమానసంస్థ అయినా పట్టించుకుందో లేదో ఎవరికీ తెలీదు. అయితే ఇదే స్విచ్ డిజైన్‌ను బోయింగ్ 787 విమానాల్లోనూ ఉపయోగించారు. అహ్మదాబాద్‌లో కూలిన విమానం ఈ రకానికి చెందినదే. అందుకే మీ వద్ద ఉన్న ఈ రకం విమానాలను స్వీయ తనిఖీ చేసుకుంటే బాగుంటుందని ఆ సంస్థ సిఫార్సుచేసింది. అయితే తనిఖీలకు ఎయిర్‌ఇండియా ఒప్పుకోలేదని చెబుతున్నారు.
విమానంలో ఇంజన్లకు సరఫరా చేసే ఇంధనాన్ని కాక్‌పిట్‌లోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లతోనే నియంత్రిస్తుంటారు. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇవే అత్యంత కీలకం. ఇంజన్ విఫలమైతే మాన్యువల్‌గా రీస్టార్ట్, షట్‌డౌన్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. మరోవైపు విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు జరిగిన తీరు, నివేదికలో ప్రస్తావించిన కొన్ని అంశాలు పైలెట్లదే తప్పు అనే అర్థం స్ఫురించేలా ఉన్నాయని పైలెట్ల అసోసియేషన్ వ్యాఖ్యానించింది. నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని డిమాండ్ చేసింది. ఇంత కీలకమైన కేసు దర్యాప్తు బృందంలో పైలట్ల నుంచి నిపుణులకు చోటివ్వకపోవడం ఏంటని ప్రశ్నించింది. కనీసం పరిశీలకులుగా అయినా పైలట్ల అసోసియేషన్ ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరింది.
ఫ్యూయల్ స్విచ్ గేట్స్ వంటి కీలక మెకానికల్, ఎలక్ట్రిక్ ఉపకరణాల వ్యవస్థలో లోపాలు ఉండొచ్చని ఆరోపణలున్నాయి. అవి సరిగా ఉన్నదీ లేనిదీ విమానం బయల్దేరే ముందే తనిఖీలు చేశారా? లేదా..? అనేది తేలాల్సి ఉంది. విమానంలో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది కీలకం. ఈ ప్రమాదం విషయంలో ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్ పాత్ర ఏమిటి అనేది ఎక్కడా పేర్కనలేదు. పైలట్ ప్రమేయం లేకుండా ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్‌లో సమస్య కారణంగా ఫ్యూయల్ స్విచ్ పొజిషన్ మారిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్ స్తంభించిపోవడం అనే అంశంపై తీవ్రంగా దృష్టిసారించాల్సిందే.
కేవలం కాక్ పిట్ వాయిస్ ఆధారంగా పైలట్లపై ఓ నిర్థారణకు రాలేమని కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పైలట్లు చేసిన పనులు చూస్తే.. వారికి దురుద్దేశాలు ఉండకపోవచ్చనే విషయం తెలుస్తుందని అంటున్నారు. విమానం టేకాఫ్ అయ్యాక ఇంజిన్లు ఆగిపోవడంతో వెంటనే మొదటి ఇంజిన్‌ను స్టార్ట్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. అది నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. తర్వాత రెండో ఇంజిన్‌నూ స్టార్ట్‌చేశారు. అది మరింత నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. పైలట్లు దురుద్దేశంతో ఇంజిన్లను ఆఫ్ చేస్తే మళ్లీ ఆన్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు. కానీ వాళ్లు వెంటనే ఆన్ పొజిషన్‌కు మార్చారు. విమానాన్ని తిరిగి తమ కంట్రోల్ లోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ లెక్కన స్విచాఫ్‌లో వాళ్ల ప్రమేయం లేదని ఊహించుకోవచ్చు. ప్రమాదం జరిగిన విమానంలో ఫ్యూయల్ స్విచ్‌లు గతంలో ఏమైనా పాడయ్యాయా? రిపేర్ చేశారా? కొత్తవి బిగించారా? అనే వివరాలు బయటకు రాకపోవడం సైతం ఫ్యూయల్ స్విచ్‌ల నాణ్యతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇలా ప్రమాదం జరిగన నెల రోజుల తర్వాత కూడా ప్రమాద కారణాలపై క్లారిటీ లేకపోగా.. కొత్త అనుమానాలు రావడం మరింత అయోమయానికి దారితీస్తోంది.
విమాన ప్రమాదంపై అసలు విచారణ నివేదిక ఇంతవరకూ వెలుగుచూడలేదు. కేవలం లీకైన అంశాల గురించి రచ్చ ఎందుకనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. ప్రస్తుతానికి విచారణలో ఏదీ తేలలేదని ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదంపై తన ప్రాథమిక నివేదికను ఈ వారంలో బహిర్గతం చేస్తామని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో..పార్లమెంటరీ కమిటీకి తెలిపింది, అయితే ప్రమాద కారణం ఏదీ ఖరారు కాలేదని అది స్పష్టం చేసినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్‌లు చెక్కుచెదరకుండా ఉన్నాయని, డేటాను పరిశీలిస్తున్నామని అంటున్నారు.
జూన్ 12న అహ్మదాబాద్‌లోని ఒక మెడికల్ కాలేజీ హాస్టల్‌పై విమానం టేకాఫ్ అయిన నిమిషంలోనే కూలిపోవడంతో విమానంలో ఉన్న 241 మందితో సహా కనీసం 260 మంది మరణించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దేశీయ విమాన ట్రాఫిక్ దాదాపు 8 శాతం తగ్గింది. అలాగే అంతర్జాతీయ ట్రాఫిక్ కూడా ఓ శాతం మేర తగ్గింది. ఇదే సమయంలో అసలు ప్రమాదం జరిగిన రోజు ఏ టైమ్ లో ఏం జరిగిందో కూడా విచారణ కమిటీ దగ్గర వివరాలున్నాయని చెబుతున్నారు. జూన్ 12న ఉదయం 11.17 గంటలకు విమానం ఢిల్లీ నుంచి వచ్చి అహ్మదాబాద్ లో ల్యాండ్ అయింది. తర్వాత మధ్యాహ్నం 1.10 గంటలకు టేకాఫ్ కు విమానం సిద్ధమైంది. 1.25 గంటలకు ట్యాక్సీ క్లియరెన్స్ అనుమతి ఇచ్చాక 23వ రన్ వే పైకి చేరుకుంది. మధ్యాహ్నం 1.32 గంటలకు గ్రౌంట్ టవర్ కంట్రోల్ కు విమానం మారింది. 1.37 గంటల 33 సెకన్లకు టేకాఫ్ క్లియరెన్స్ వచ్చింది. 1.37 గంటల 37 సెకన్లకు టేకాఫ్ మొదలైంది. 1.38 గంటల 39 సెకన్లకు విానం ఎయిర్, గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్ లోకి మారాయి. దీంతో విమానం గాల్లోకి లేచింది. 1.38 గంటల 42 సెకన్లకు విమానం గరిష్ఠ వేగం 180 నాట్స్‌ను అందుకుంది. ఆ మరుక్షణమే విమాన ఇంజిన్ 1, ఇంజిన్ 2కు చెందిన ఇంధన స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్‌కు మారాయి. ఒక సెకను తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి.
స్విచ్‌లు ఆగిపోవడంతో ఇంధన సరఫరా ఆగిపోయింది. దీంతో ఇంజిన్లు రెండూ నిర్దేశిత టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. ఎయిర్‌పోర్టు పెరీమీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకు రావడం సీసీటీవీలో రికార్డైన దృశ్యాల్లో కనిపిస్తోంది.
ఇంజిన్ కంట్రోల్ స్విచ్‌లను రన్‌కు మారినప్పుడు ప్రతి ఇంజిన్ ఫుల్ అథారిటీ డ్యూయల్ ఇంజిన్ కంట్రోల్ ఆటోమేటిక్‌గా రీలైట్ చేస్తుంది. అప్పుడు ఇంధనం వచ్చి థ్రస్ట్ రికవరీ అవుతుంది. ఈ విమానంలో మొదటి ఇంజిన్ తిరిగి ఆన్ అవడం ప్రారంభించింది. కానీ, రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయింది.
మధ్యాహ్నం 1.39 గంటల 5 సెకన్లకు విమానం ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించిన పైలట్లు మేడే సందేశాన్ని పంపించారు.1.39 గంటల 11 సెకన్లకు డేటా రికార్డింగ్ ఆగిపోయింది. 1.44 గంటల 44 సెకన్లకు సహాయక చర్యల నిమిత్తం ఎయిర్పోర్ట్ నుంచి క్రాష్ ఫైర్ టెండర్లు బయలుదేరాయి. ఘటన సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయనట్లుగా అనిపించాయి. కానీ, బ్లాక్‌బాక్స్ డేటాను పరిశీలించగా, థ్రస్ట్ పని చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. సాంకేతిక వైఫల్యం ఉన్నట్లుగా అనుమానించారు. టేకాఫ్ చేసేందుకు ఫ్లాప్ సెట్టింగ్, గేర్ సాధారణంగానే పని చేశాయి. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఆకాశం స్పష్టంగా ఉంది. గాలులు కూడా తేలికగానే ఉన్నాయి. ఎయిర్‌ఇండియా విమాన పైలట్లు ఇద్దరూ మెడికల్‌గా ఫిట్‌గానే ఉన్నారు. అనుభవం కూడా బాగానే ఉంది.
గతంలో ఈ విమానంలోని ఇంధన కంట్రోల్ స్విచ్‌లలో ఏదైనా సమస్య వచ్చినట్లు రికార్డుల్లేవంటున్నారు. ఇంధన కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై బోయింగ్ ఆప్షనల్ అడ్వైజరీ జారీ చేసినా.. ఎయిరిండియా మాత్రం అనుసరించలేదు. సంబంధిత తనిఖీలు చేపట్టలేదు. విమానం థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్స్‌ను 2019, 2023లో భర్తీ చేశారు.
మొత్తంగా సెకన్ల వ్యవధిలో విమానం కుప్పకూలిందన్న విషయమైతే స్పష్టంగా తెలుస్తోంది. పైలట్లు ప్రమాద నివారణకు ప్రయత్నించినా.. వారికి పెద్దగా టైమ్ లేదని కూడా తేలిపోయింది. కచ్చితంగా పైలట్ల నియంత్రణలోని అంశాలేవో బలంగా పనిచేసి.. విమానాన్ని కూల్చేశాయనే ఊహాగానాలు మొదట్నుంచీ ఉన్నాయి. కానీ ప్రమాద కారణాలను ఆధారాలతో సహా నిర్థారించాల్సి ఉంటుంది. అందుకోసం విచారణ కమిటీ నివేదిక వచ్చేదాకా ఆగాలని కేంద్రం కోరుతోంది. తుది నివేదిక వచ్చాకే తప్పెక్కడ జరిగిందో తేలుతుందని, అంతవరకూ ఎవర్నీ తప్పుబట్టలేమని క్లారిటీ ఇచ్చింది.
విమాన ప్రమాదంపై తుది అంచనాకు రావడానికి కాక్ పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే డిజిటల్ వీడియో రికార్డర్ కూడా ప్రమాద కారణాలను గుర్తించడానికి సహకరిస్తుంది. ఎయిరిండియా విమానానికి సంబంధించిన వీడియో రికార్డర్ కూడా లభ్యం కావడంతో.. కాస్త ఆలస్యమైనా అసలు కారణం వెలుగుచూస్తుందనే ఆశలున్నాయి.
విమానంలో కాక్ పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ తో పాటు.. డిజిటల్ వీడియో రికార్డర్ కూడా ఉంటుంది. ఇది విమానంలో ఉన్న CCTV కెమెరాల నుండి ఫుటేజ్‌ను రికార్డ్ చేస్తుంది. ఈ వీడియో రికార్డర్ కు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. దీంతో ప్రమాదం జరిగిన విమానానికి సంబంధించిన వీడియో రికార్డర్ దొరికితే.. అందులో ఫుటేజ్ ను తిరిగి పొందవచ్చు.
డిజిటల్ వీడియో రికార్డర్.. ఇంచుమించుగా ఓ హార్డ్ డిస్క్ లా పనిచేస్తుంది. ఇది కాక్‌పిట్, ప్యాసింజర్ క్యాబిన్, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ల దగ్గరున్న CCTV కెమెరాల నుండి ఫుటేజ్‌ను నిల్వ చేస్తుంది. ఈ పరికరం CCTV కెమెరాల నుండి అనలాగ్ వీడియో సిగ్నల్‌లను డిజిటల్‌గా సురక్షితంగా ఎన్‌కోడ్ చేస్తుంది. వీడియోలు, ఆడియో, రాడార్ డేటా ప్రకారం ఎయిరిండియా విమానం టేకాఫ్ తర్వాత వేగాన్ని కోల్పోయింది. పైలట్ సందేశంతో పాటు విమానం గాల్లో ఎగరలేకపోయిన తీరు చూస్తే ఇంజిన్ థ్రస్ట్ లేకపోవడం కానీ, లిఫ్ట్ లోపించడం కానీ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే విమానం ల్యాండింగ్ గేర్ కూడా క్రాష్ సమయంలో కూడా దిగిపోలేదు, ఇది సాధారణ టేకాఫ్ ప్రోటోకాల్స్ పాటించలేదనే అనుమానాలకు దారి తీసింది.
విమానంలోని రెండు బ్లాక్‌బాక్స్‌లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. పైలట్ డేటా, మెకానికల్ లోపాన్ని గుర్తించటానికి వీటి డేటా కీలకంగా మారుతుంది. మొత్తం మీద సమగ్ర దర్యాప్తు జరుగుతున్న సమంయలో.. విచారణ నివేదికలో కొన్ని అంశాలు లీక్ కావడం కచ్చితంగా కొత్త సందేహాలకు తావిచ్చే అంశమే. ఈ పరిణామంలో విచారణ నిష్పాక్షితపైనా ప్రశ్నలు రావటానికి అవకాశం వచ్చింది. అయితే కేంద్రం వెంటనే అప్రమత్తమై.. ఇప్పటికిప్పుడు ఏదీ నిర్థారణ కాలేదని చెప్పినా.. ఇకనైనా లీకుల విషయంలో జాగ్రత్తపడితే విచారణపై నమ్మకం పెరిగే అవకాశాలుంటాయి.
ఎయిరిండియా విమాన ప్రమాదంలో కేవలం ఆ సమయంలో జరిగిన అంశాల ఆధారంగానే ప్రమాద కారణాల్ని అన్వేషించడం కుదరదనే వాదన మొదట్నుంచీ ఉంది. బోయింగ్ సంస్థ తయారీ విధానాల్లో లోపాలు, ఎయిరిండియా నిర్వహణా విధానం పైనా విచారణ జరగాల్సి ఉందనే డిమాండ్లున్నాయి. విచారణలో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. చనిపోయిన పైలట్లపై నెపం నెట్టేసి చేతులు దులుపుకునే అవకాశాలున్నాయనే అనుమానాలు వస్తున్నాయి. నిజానికి అలాంటి అనుమానాలు కలిగేలా విచారణ అధికారులే చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. ఇక్కడ బోయింగ్ ను కానీ, ఎయిరిండియాను కానీ అతి పెద్ద గందరగోళం తప్పదని, అందుకే పైలట్లు ఎలాగో చనిపోయారు కాబట్టి.. వారి మీదకు నెపం నెట్టేస్తే పనైపోతుందని భావించవచ్చని అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ ఊహాగానాలేనని తేల్చేస్తోంది. పైలట్లపై నిందలు మోపే ఉద్దేశం ఎవరికీ లేదని స్పష్టం చేస్తోంది.
మొత్తం మీద భవిష్యత్తులో విమాన ప్రమాదాలు నివారించాలంటే.. ఇప్పుడు కచ్చితమైన ప్రమాద కారణాన్ని కనుగొనడం చాలా కీలకం. ఇప్పుడు పొరపాటు చేస్తే మాత్రం.. మరిన్ని ప్రమాదాలకు తావిచ్చినట్టవుతుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే తమ తప్పు లేదని క్లీన్ చిట్ ఇప్పించుకోవాటనికి ఇటు ఎయిరిండియా, అటు బోయింగ్ ప్రయత్నాలు చేస్తున్నాయనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. గతంలో విమాన ప్రమాదాలు జరిగినప్పుడు విచారణ కమిటీలు తేల్చిన కారణాలను కూడా నిపుణులు ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. గతంలోనూ కొన్నిసార్లు చనిపోయిన పైలట్లే తప్పు చేసినట్టుగా తేల్చి.. విచారణ ముగించారు. కానీ ఇప్పుడు అలాంటిది జరిగితే ఊరుకునేది లేదని పైలట్ల అసోసియేషన్ ముందుగానే హెచ్చరించింది. దీనికి తోడు నిజంగానే పైలట్లదే తప్పు అని చెబితే.. అప్పుడు విమానం డిజైన్ లోపాల దగ్గర్నుంచి.. ఎయిరిండియా డ్యూటీల దాకా అన్నింటిపైనా పైలట్లు నిరసన గళం విప్పొచ్చు. అప్పుడు దేశీయ పౌరవిమానయాన రంగంలో మరింత అయోమయం తప్పదు. అలా జరగకూడదంటే.. కచ్చితంగా విమాన ప్రమాదానికి నిర్దిష్ట కారణం చెప్పాలి. అది సహేతుకంగా ఉండాలి. అలాగే పక్కా ఆధారాలుండాలి. పోనీ ఏ కారణం చెప్పకుండా విచారణ ముగించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే దేశ చరిత్రలోనే అతి పెద్ద విమాన ప్రమాదం జరిగినప్పుడు.. దాన్ని లైట్ తీస్కోవడం తప్పుడు సంకేతాలు పంపుతుంది.
ప్రమాదం జరిగిన విమానాన్ని తయారు చేసిన బోయింగ్.. అమెరికా కంపెనీ. అలాగే ఇప్పుడు విచారణ కమిటీ నివేదికలో కొన్ని అంశాలు లీకైంది కూడా అమెరికా మీడియాలోనే. అదే సమయంలో విచారణ కోసం అమెరికా నిపుణులు కూడా ఇండియా వచ్చారు. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే.. లీకేజ్ ఉద్దేశపూర్వకంగానే జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం లీకేజీపై రచ్చ జరగడంతో.. భవిష్యత్తులో లీకులకు అడ్డుకట్ట పడుతుందా.. లేదా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైనా విచారణ వేగవంతం చేసి.. ప్రమాద కారణాన్ని త్వరగా తేల్చేస్తే.. అనవసర అనుమానాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. అలా కాకుండా విచారణను సాగదీసేకొద్దీ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావనే గ్యారెంటీ ఎవరూ ఇవ్వలేరు. ఇప్పటికే పెద్ద విషాదం జరిగింది. బాధిత కుటుంబాలు ఇంకా షాక్ లోనే ఉన్నాయి. ఇలాంటి భారమైన వాతావరణంలో.. లేనిపోని సందేహాలు, కొత్త ప్రశ్నలు పుట్టుకురావడం ఎవరికీ మంచిది కాదు. అందుకే ప్రభుత్వం ప్రమాద ఘటన సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత అప్రమత్తంగా వ్యవహరించడం చాలా అవసరం.
