AIIMS Delhi Servers: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్లపై సైబర్ దాడికి పాల్పడింది చైనా హ్యాకర్లేనని ప్రభుత్వ వర్గాలు ఈ రోజు తెలిపాయి. ప్రస్తుతం అందులోని డేటాను రిట్రీవ్ చేసినట్లు తెలిపాయి. ఈ సైబర్ దాడి చైనా హ్యాకర్ల పనే అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. హ్యాక్ చేసిన డేటాను ఆసుపత్రి వర్గాలు తిరిగి పొందినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లోని 100 సర్వర్లలో.. 40 భౌతికంగా,60 వర్చువల్‌గా పనిచేస్తున్నాయి. ఇందులో 5 భౌతిక సర్వర్లలో హ్యకర్లు చొరబడినట్లు వెల్లడించారు. నష్టం జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు అది అదుపులో ఉందన్నారు. ఐదు సర్వర్‌లలోని డేటా విజయవంతంగా తిరిగి పొందబడిందన్నారు.
India-China Clash: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న సరిహద్దు ఘర్షణలు.. విపక్షాలు వాకౌట్
నవంబరు 23న మొదటిసారిగా సర్వర్లపై సైబర్ దాడి జరిగింది. రెండు రోజుల తర్వాత ఢిల్లీ పోలీస్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) సైబర్ టెర్రరిజం కింద కేసును నమోదు చేసింది. అయితే సర్వర్లను పునరుద్ధరించడానికి హ్యాకర్లు రూ. 200 కోట్ల క్రిప్టోకరెన్సీని అడిగారన్న నివేదికలను పోలీసులు ఖండించారు. హ్యాక్ చేసిన సర్వర్లలో కోట్లాది మంది రోగుల సమాచారం నిక్షిప్తమై ఉంది. ఇందులో వీవీఐపీలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల సమాచారం కూడా ఉంది. హ్యాకింగ్ గురించి తెలియగానే.. ఎయిమ్స్‌లో అన్ని సర్వర్లు, కంప్యూటర్లకు యాంటీ వైరస్ సొల్యూషన్ ప్రక్రియ చేపట్టారు. దీనిపై ఎయిమ్స్ కూడా ఓ ప్రకటనను విడుదల చేసింది. సర్వర్లలో ఈ హాస్పిటల్ డేటాను పునరుద్ధరిస్తున్నామని తెలిపింది. డేటా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మరికొంత సమయం పడుతుందని.. అందువల్ల అప్పటివరకు ఆసుపత్రిలో అన్ని సేవలు మ్యానువల్‌గా జరుగుతాయని ఎయిమ్స్ వెల్లడించింగి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సమగ్ర విచారణ జరిపి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు ఈ అంశం పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది. “దాడి మూలం, ఉద్దేశం, పరిధి అస్పష్టంగానే ఉంది” అని తిరువనంతపురం ఎంపీ లోక్‌సభలో అన్నారు.