Site icon NTV Telugu

TPCC: తెలంగాణ పీసీసీ కార్యవర్గం ప్రకటన.. ఉపాధ్యక్షులుగా 27 మందికి అవకాశం!

Tpcc, Aicc

Tpcc, Aicc

తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటించింది. 27 మందికి ఉపాధ్యక్షులుగా, 69 మందికి ప్రధాన కార్యదర్శులుగా టీపీసీసీ కార్యవర్గంలో చోటు దక్కింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండా కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులను భర్తీ చేసింది. నూతన కార్యవర్గంలో ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు చోటు లభించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌ రెడ్డి, చిక్కుడు వంశీ కృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌, బసవరాజు సారయ్య నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీలు (ప్రధాన కార్యదర్శులు)గా ఎమ్మెల్యేలు వేడ్మ బొజ్జు, పర్ణికారెడ్డి, మట్టా రాగమయి.. తదితరులకు టీపీసీసీ కార్యవర్గంలో చోటు లభించింది. కాంగ్రెస్ హైకమాండ్ అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. సంస్థాగతంగా నిబద్దతతో పనిచేసిన కార్యకర్తలకు అవకాశం దక్కింది.

Also Read: Prabhakar Rao-SIT: 8 గంటలు కొనసాగిన విచారణ.. ప్రభాకర్‌ రావుపై సిట్‌ ప్రశ్నల వర్షం!

గతంతో పోలిస్తే టీపీసీసీ కమిటీని ఏఐసీసీ కుదించింది. 35 మంది ఉపాధ్యక్షులను 27కి కుదించగా.. 85 మంది ప్రధాన కార్యదర్శి పదవులను 69కి తగ్గించింది. కమిటీ కూర్పులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన మార్క్ చూపించారు. టీపీసీసీ కార్యవర్గంలో పీసీసీ సామాజిక న్యాయం పాటించింది. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అవకాశం దక్కింది. మొత్తంగా టీపీసీసీలో 96 మంది నేతలకు కీలక పదవులు దక్కాయి. ఇటీవల ఐదు కమిటీలను ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Exit mobile version