Site icon NTV Telugu

AI-Based Cyber Fraud: AI టెక్నాలజీతో మాయ చేస్తున్న కేటుగాళ్లు.. ఇది కూడా వదలరా..?

Ai

Ai

AI-Based Cyber Fraud: వీడియోలో మీ ముఖమే కనిపిస్తూ ఉంటుంది. కానీ అది మీరు కాదు. ఆడియోలో మీ మాటలే వినిపిస్తూ ఉంటాయి. కానీ మాట్లాడేదీ మీరు కాదు. మీరు చేయని అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పనులు కూడా మీరే చేసినట్లు వీడియోల్లో కనిపిస్తూ ఉంటుంది. అవేవీ మీరు చేసి ఉండరు. కానీ వీడియోలు, ఫొటోలు మాత్రం మిమ్మల్నే అపరాధిగా మార్చేస్తాయి. ఇదంతా ఏఐ అని షార్ట్‌గా చెప్పుకునే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ చేస్తున్న మాయ. అంతా తావీద్‌ మహిమ అని రోడ్‌ పక్కన గారడీల వాడు చెప్పినట్టు… ఇప్పుడంతా AI మహిమ అని చెప్పుకోవాలి. ఆడియో–వీడియో సింథసిస్‌ ద్వారా జరుగుతున్న సరికొత్త సైబర్‌ నేరమే డీప్‌ ఫేక్‌. డార్క్‌ వెబ్‌తో పాటు ఇంటర్‌నెట్‌ నుంచి కొనుగోలు చేసిన టూల్స్‌ ఉపయోగించి… సింథసిస్‌ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అనేకమందికి వర్చువల్‌ నంబర్ల నుంచి బ్లాంక్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయి. ఆన్సర్‌ చేస్తే… అవతలి వారు కనిపించరు, మాట్లాడరు. హలో హలో అంటూ ఉంటామే తప్ప… అవతలివైపు నుంచి సమాధానం ఉండదు. ఆ సమయంలోనే సైబర్‌ నేరగాళ్ళు రిసీవర్‌ వీడియో రికార్డ్‌ చేస్తారు. ఆ వీడియో, ఆడియో, ఫొటోలను ఉపయోగించి పోర్న్‌ వీడియోలతో సింథసిస్‌ చేసి మీరే వీడియో కాల్‌ చేసినట్లు క్రియేట్‌ చేస్తారు. సింథసిస్‌ చేసిన వీడియోను చూపించి బాధితుడిని భయపెట్టి వీలున్నంత దండుకుంటారు. ఈ తరహా నేరాల్లో ప్రధానంగా యువకులు, మధ్య వయస్కులే టార్గెట్‌ అవుతున్నారు.

ఇంకోరకంగా కూడా ఉంటుంది. అది సెంటిమెంట్‌ని రెయిజ్‌ చేసి డబ్బులు గుంజడం. కిడ్నాప్‌ అయ్యాననో, ఎమర్జెన్సీ అనో… ఓ వ్యక్తి ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేసి… ఆ వీడియోలను కుటుంబసభ్యులకు చూపించి అందినకాడికి దండుకుంటారు. ఈ నేరాలు ఘోరాలు చేసేందుకు అవసరమైన ఫోన్‌ నంబర్లు, వివరాలన్నీ తెలుసుకునేందుకు నేరగాళ్లు పెద్ద కష్టపడనక్కరలేదు. ఈ మధ్య కేరళలో ఓ కేస్‌ హాట్‌ టాపిక్‌ అయింది. అదేంటంటే… కోజికోడ్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి రాధాకృష్ణన్‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన ఆన్సర్ చేయలేదు. ఆ తర్వాత అదే నంబర్ నుంచి చాలా మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌లు పంపిన ఆ వ్యక్తి తన పేరు చెప్పాడు. కోల్‌ ఇండియాలో మీతో కలసి పనిచేశానన్నాడు. అప్పుడు రాధాకృష్ణన్‌కు స్ట్రైక్‌ అయింది.

ఆ వ్యక్తితో దాదాపు 40 ఏళ్ల పాటు కోల్‌ ఇండియాలో కలసి పనిచేశాడు రాధాకృష్ణన్‌. కొద్దిసేపు ఇద్దరూ చాటింగ్ చేశారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు కనుక్కున్నారు. కామన్‌ ఫ్రెండ్స్‌ గురించి కూడా చర్చకు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత అదే నంబర్ నుంచి రాధాక్రిష్ణన్‌కు వాయిస్ కాల్ వచ్చింది. తాను ప్రస్తుతం దుబాయ్‌ నుంచి ఇండియా వస్తున్నానని చెప్పాడు. తన దగ్గరి బంధువుకు ముంబయిలోని హాస్పిటల్‌లో అత్యవసరంగా సర్జరీ చేయాలని… అందుకు 40 వేలు అడ్వాన్స్‌గా చెల్లించాలని చెప్పాడు. సాయం చేయమని రాధాకృష్ణన్‌ను అడిగాడు. వెంటనే నమ్మకం కుదరని రాధాకృష్ణన్… వీడియో కాల్ చేయమన్నాడు. కొద్దిసేపటికే వీడియో కాల్ వచ్చింది. దాంతో నమ్మకం కుదిరింది. ఫోన్‌ చేసింది తన మాజీ కొలీగ్‌ అని నమ్మాడు రాధాకృష్ణన్‌. 25 సెకండ్లు మాత్రమే వీడియోల్‌ కాల్‌లో మాట్లాడుకున్నారు. ఆ వెంటనే తను అడిగిన 40వేలను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.

కాసేపటి తర్వాత అదే వ్యక్తి మరోసారి ఫోన్‌ చేసి మరో 35 వేలు అడిగాడు. దీంతో అనుమానం రాధాకృష్ణన్‌కు అనుమానం వచ్చింది. అకౌంట్‌లో అంత బ్యాలెన్స్ లేదని చెప్పి కాల్ కట్ చేశాడు రాధాకృష్ణన్. అప్పుడు తన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న మాజీ కొలీగ్ అసలు నంబర్‌కు కాల్ చేశాడు. అప్పుడే అసలు నిజం బయటపడింది. తాను అసలు ఫోనే చేయలేదని కొలీగ్‌ చెప్పారు. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న రాధాకృష్ణన్‌ వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు నుంచి లావాదేవీలు జరిగినట్టు తేలింది. పోలీసుల సూచనతో బ్యాంకు అధికారులు ఖాతాను నిలిపివేశారు. కేరళ పోలీసుల సైబర్ ఆపరేషన్స్ వింగ్ ఆ 40వేల రూపాయలను స్వాధీనం చేసుకొని రాధాకృష్ణన్‌కు అప్పగించారు. ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో దేనిని నమ్మడానికి వీల్లేదు. కళ్ల ముందు కనిపించేదంతా నిజం కాదు. అదంతా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ చేస్తున్న కనికట్టు. నకిలీ వీడియోలు, వీడియో కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉంటే మోసాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

Exit mobile version