ఇటీవల సెలబ్రిటీ ఈవెంట్లలో అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న లులూ మాల్‌లో జరిగిన రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల కొందరు అభిమానులు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆమెను తాకేందుకు ప్రయత్నించడంతో నిధి అసహనానికి గురైంది.
ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సమంత, ఈవెంట్ పూర్తయ్యాక బయటకు వెళ్లే సమయంలో అభిమానుల గుంపు ఒక్కసారిగా ఆమె చుట్టూ చేరింది. ఈ క్రమంలో కొందరు అభిమానులు ఆమెను తాకేందుకు ప్రయత్నించడంతో వారి నుండి తప్పించుకుని సమంత తన కారులోకి వెళ్ళిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొన్న నిధి నేడు సమంత ఇలా సెలెబ్రిటీస్ పట్ల అభిమానులు అసభ్యంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. స్టార్ హీరోయిన్లు అయినప్పటికీ, కనీస గౌరవం ఇవ్వకుండా ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రోజు రోజుకీ అభిమానుల్లో సివిక్ సెన్స్ తగ్గిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ఈవెంట్ నిర్వాహకులు, భద్రతా సిబ్బంది మరింత కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
