Afghanistan’s ODI World Cup 2023 Semi Final Scenario : ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే భారత్ అధికారిక సెమీస్ బెర్త్ దక్కించుకోగా.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్ల నిష్క్రమణ కూడా ఖాయం. సెమీస్‌లోని మూడు బెర్తుల కోసం 5 జట్ల మధ్య పోటీ నెలకొంది. 12 పాయింట్స్ ఉన్న దక్షిణాఫ్రికాకు ఓ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. మరో మ్యాచ్ గెలిస్తే ప్రొటీస్ అధికారికంగా సెమీస్ చేరుతుంది. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొంది. ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన అఫ్గాన్.. పెద్ద జట్లతో పాటుగా సెమీస్ రేసులో ఉండడం విశేషం. అఫ్గానిస్థాన్‌కు అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రపంచకప్ 2023లో అఫ్గానిస్థాన్ అంచనాలకు మించి రాణించింది. టోర్నీని మామూలుగానే ఆరంభించిన అఫ్గాన్.. తర్వాత అనూహ్య ప్రదర్శనతో ఆందరినీ ఆశ్చర్యపరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంకకు పెద్ద షాక్ ఇచ్చింది. చివరి 3 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌లను ఓడించడంతో అఫ్గాన్ సెమీస్ రేసులోకి వచ్చింది. కివీస్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం కూడా అఫ్గాన్ సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ బెర్తులు సొంతం చేసుకున్నా.. నేడు కివీస్ ఓడితే అవకాశాలు అఫ్గాన్‌కే ఉన్నాయి.
Also Read: NZ vs PAK: టాస్ గెలిచిన పాకిస్తాన్.. కేన్ మామ వచ్చేశాడు! రసవత్తరంగా సెమీస్
తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై అఫ్గానిస్థాన్ ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్లను ఓడించడం అఫ్గాన్‌కు అంత ఈజీ కాదు. అయితే అఫ్గాన్ ఒక్క మ్యాచ్‌లో గెలిచినా.. అవకాశాలు మెరుగవుతాయి. అదే సమయంలో కివీస్ తాను ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. ఒకవేళ ఒక్క మ్యాచ్ ఓడినా.. రన్‌రేట్‌లో అఫ్గాన్ కన్నా వెనకంజలో ఉండాలి. అలా కాకుండా.. ఆస్ట్రేలియా రెండు మ్యాచులలో ఓడిపోయినా అఫ్గాన్‌కు అవకాశం ఉంటుంది. అయితే అఫ్గాన్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.