Afganishtan Diplomat: భారతదేశంలో అత్యంత సీనియర్ ఆఫ్ఘన్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆమె దుబాయ్ నుండి సుమారు రూ. 19 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించిన ఆరోపణలపై గత వారం ముంబై విమానాశ్రయంలో పట్టుబడ్డారు. అయితే ఆమె విదేశీ దౌత్యవేత్త కావడంతో ఆమె అరెస్టు నుండి తప్పించుకున్నారు. తనపై వ్యక్తిగత దాడులు, నిరంతర పరువునష్టం తన రాజీనామాకు కారణమని ఆమె పేర్కొన్నప్పటికీ, రాజీనామాను బంగారం స్మగ్లింగ్ కేసుతో ముడిపెడుతున్నారు. ముంబైలో ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్‌గా ఉండటంతో పాటు న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక రాయబారి బాధ్యతలను కూడా జకియా వార్దక్ చూస్తున్నారు. తన పాత్రను అప్రతిష్టపాలు చేసేందుకు, తన ప్రయత్నాలను అణగదొక్కడమే లక్ష్యంగా తనపై దాడులు జరిగాయని వార్దక్ అన్నారు. భారతదేశంలో తనకు లభించిన గౌరవం, తన పదవీకాలంలో తనకు అందించిన తిరుగులేని మద్దతుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Wolf Man: ప్రపంచంలోని అత్యంత వెంట్రుకల కుటుంబం.. ఎక్కడో తెలుసా..
జకియా దుబాయ్ నుంచి సుమారు రూ.19 కోట్ల విలువైన బంగారాన్ని తన బట్టలు, బెల్టులో దాచిపెట్టడంతో ముంబై విమానాశ్రయంలో పట్టుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) ఆమెను సుమారు 12 గంటల పాటు విచారించినప్పటికీ, ఆమెకు దౌత్యపరమైన పాస్‌పోర్ట్ ఉన్నందున ఆమె అరెస్టు నుండి తప్పించుకున్నట్లు చెబుతున్నారు. విదేశీ దౌత్యవేత్తలకు దౌత్యపరమైన మినహాయింపు ఉంటుంది, వారిని అరెస్టు చేయలేరు. మూడేళ్ల క్రితం ముంబైలోని ఆఫ్ఘన్ కాన్సులేట్‌లో నియమితులయ్యారు. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలన అమలు కాలేదు. ఆమె ఆఫ్ఘనిస్తాన్ ఏకైక మహిళా దౌత్యవేత్త కూడా. కొంత కాలంగా ఆమె ఢిల్లీలోని ఆఫ్ఘన్ ఎంబసీని కూడా చూసుకుంటున్నారు.
