NTV Telugu Site icon

Advocate Rayin : న్యాయంగా ఈ న్యాయవాదిది మంచి మనసు

Lawyer

Lawyer

Advocate Rayin : కొందరు న్యాయవాదులు తమ దగ్గరకు న్యాయం కావాలి సారు.. అని వచ్చినప్పుడు వారివద్ద ఫీజు తీసుకుని వారిని ఒక క్లయింట్ గానే భావిస్తుంటారు. కేసు వాదించి అంతటితో వారిని వదిలేస్తుంటారు. ఆ సమయంలో వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోరు. క్లయింట్ల నుంచే ఫీజు కాకుండా ఇతరత్రా ఖర్చులేవైనా ఉంటే పెట్టించేవారూ ఉన్నారు. ఈ క్రమంలోనే కేరళకు చెందిన న్యాయవాది రయిన్ కేఆర్ మానవత్వానికి ప్రతిబింబంలా నిలిచారు. పోలియో సోకి అవిటివాడైన తన క్లయింటును ఆయన తన వీపుపై మోసుకుంటూ కోర్టుకు తీసుకువచ్చి, అందరి అభినందనలు అందుకున్నారు.

Read Also: New Type Helmet: కొడుకుల కోసం కొత్త హెల్మెట్ తయారు చేసిన తల్లి

రయిన్ కేఆర్ అనే వ్యక్తి కొట్టాయం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సజీవన్ అనే 60 ఏళ్ల దివ్యాంగుడి తరఫున కేసును వాదిస్తున్నారు. అది ఓ సివిల్ కేసు. ఈ నెల 7న ఈ కేసు విచారణ కొట్టాయం కోర్టులో జరిగింది. విచారణకు హాజరయ్యేందుకు సజీవన్ తన మూడు చక్రాల స్కూటర్ పై కోర్టు వద్దకు వచ్చాడు. కోర్టు హాల్ మొదటి అంతస్తులో ఉండడంతో ఆయన పైకి ఎక్కలేకపోయాడు. దాంతో న్యాయవాది రయిన్… సజీవన్ ను తన వీపుపై మోసుకుంటూ మెట్ల మీదుగా మొదటి అంతస్తులోని కోర్టు హాల్ కు తీసుకువచ్చారు. ఇది అక్కడున్న వారందరి దృష్టిని ఆకర్షించింది. ఇతర న్యాయవాదులు కూడా రయిన్ చర్యను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు.

Read Also:Tragedy: విచిత్రం వారు కవలలు.. ఒకరు చనిపోగానే 900కి.మీ. దూరంలోని అతనూ చనిపోయాడు

గతంలో కోర్టు హాల్ ఓ పాత భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండేది. అయితే దాన్ని మరో భవనంలోని మొదటి అంతస్తుకు మార్చారు. ఈ విషయం సజీవన్ కు కోర్టు వద్దకు వచ్చాకే తెలిసింది. దాంతో ఆయన మెట్లు ఎక్కలేక నిస్సహాయుడై ఉండగా, న్యాయవాది రయిన్ ఎంతో గొప్ప మనసుతో వీపుపై మోసుకుంటూ తీసుకెళ్లారు. అంతేకాదు, విచారణ ముగిసిన తర్వాత మళ్లీ వీపుపై మోసుకుంటూ కిందికి తీసుకువచ్చారు.

Show comments