ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం , అస్తిత్వ పరిరక్షణ కోసం ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుం దెబ్బ”, జిల్లా ఏజెన్సీ ప్రాంత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 19న సంపూర్ణ ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ బంద్ ప్రధానంగా ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన , సంస్కృతీ సాంప్రదాయాల అస్తిత్వాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా సాగుతోంది. గిరిజన ప్రాంతాల్లో స్వయంపాలనను బలోపేతం చేసే జీవో 5 (PESA – పేసా చట్టం)ను సంపూర్ణంగా అమలు చేయాలని, తద్వారా స్థానిక వనరులపై గిరిజనులకే పూర్తి అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పోరాట యోధుడు కుమ్రం భీమ్ ఆశయాలైన “జల్ – జంగల్ – జమీన్” (నీరు, అడవి, భూమి) సూత్రానికి అనుగుణంగా “మన అడవి – మన హక్కు – మన భవిష్యత్తు” అనే నినాదంతో ఆదివాసీలు తమ నిరసన స్వరాన్ని వినిపిస్తున్నారు.
బంద్ ప్రభావంలో భాగంగా ఏజెన్సీ పరిధిలోని అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని పిలుపునిచ్చారు. అలాగే వర్తక, వ్యాపార సముదాయాలు, దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని, రోడ్డు రవాణా సేవలను నిలిపివేసి నిరసన తెలుపాలని ఆదివాసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఆదివాసీ హక్కుల సాధన కోసం ప్రజలంతా ఐక్యంగా నిలబడి, హక్కులను బలంగా కాపాడుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, ప్రయాణికులు ఈ బంద్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.

