Adidas Layoffs: ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్ (Adidas) గురుగ్రామ్‌లోని తన ఇండియా టెక్ హబ్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీలోని టెక్నాలజీ విభాగానికి చెందిన సిబ్బందిని భారీగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. వ్యాపారంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తమ ఆపరేటింగ్ మోడల్‌ను మార్చుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ‘వోకల్ట్’ (Wocult) పత్రికకు ఇచ్చిన ప్రకటనలో అడిడాస్ ధృవీకరించింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా కంపెనీకి సేవలందించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపిన అడిడాస్, లేఆఫ్స్‌తో ప్రభావితమైన సిబ్బందికి ట్రాన్సిషన్ అసిస్టెన్స్ ద్వారా పూర్తి మద్దతు అందిస్తామని స్పష్టం చేసింది.
తమ సంస్థాగత నిర్మాణాన్ని మరింత సరళతరం చేయడంతో పాటు క్రిటికల్ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికే ఈ మార్పులు చేస్తున్నామని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతికంగా బలపడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని కంపెనీ పేర్కొంది. అడిడాస్ ఎంతమందిని తొలగిస్తున్నామనేది అధికారికంగా వెల్లడించనప్పటికీ, గురుగ్రామ్‌లోని ఇండియా టెక్ హబ్‌లో ఉన్న సుమారు 700 మంది ఉద్యోగుల్లో దాదాపు 350 మందికి పైగా సిబ్బందిని సాగనంపుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ సెంటర్‌లోని మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 45 నుంచి 50 శాతం మందిపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుంది.
సెప్టెంబర్ 15న నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో యాజమాన్యం ఈ లేఆఫ్స్ విషయాన్ని ఉద్యోగులకు స్వయంగా వెల్లడించింది. ప్రభావితమైన సిబ్బందిని కంపెనీ రెండు గ్రూప్‌లుగా విభజించింది. ఇందులో మొదటి గ్రూప్‌లోని ఉద్యోగులకు అదే రోజున నేరుగా ఎగ్జిట్ లెటర్లు ఇచ్చేయగా, రెండో గ్రూప్‌లోని వారిని డిసెంబర్ వరకు విధులు నిర్వర్తించాలని కోరింది. వీరు తమ బాధ్యతలను ఇతర టెక్నాలజీ హబ్‌ల సహోద్యోగులకు హ్యాండోవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయాన్ని ఉపయోగించుకుని కంపెనీలోని ఇతర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వారికి అవకాశం కల్పించారు. ఒకవేళ డిసెంబర్ నాటికి వారు కంపెనీలో వేరే ఉద్యోగం సాధించలేకపోతే, డిసెంబర్ 15నే వారి చివరి పనిదినంగా అడిడాస్ నిర్ణయించింది. అయితే వీరికి ఇచ్చే సెవెరెన్స్ ప్యాకేజీ, నోటీస్ పీరియడ్ పే లేదా రీడిప్లాయ్‌మెంట్ సపోర్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇక, గురుగ్రామ్‌లోని ఈ అడిడాస్ కార్యాలయం కేవలం లోకల్ మార్కెటింగ్ విభాగానికి మాత్రమే కాకుండా, గ్లోబల్ ఇంజనీరింగ్ టెక్ హబ్‌గా కూడా కీలక సేవలందిస్తోంది. ఇటీవలి కాలంలో అడిడాస్ భారతదేశంలో తన కార్యకలాపాలను వేగంగా విస్తరించింది. అందులో భాగంగానే 2024లో చెన్నైలో ఓ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే గురుగ్రామ్‌లోని గ్లోబల్ టెక్ హబ్‌లో సగానికి సగం ఉద్యోగులను తొలగించడం ఐటీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

