NTV Telugu Site icon

Congress: బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి రాజీనామా

Ahi

Ahi

పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమబెంగాల్‌లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు. బహరంపూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్‌పై దాదాపు 85,022 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాపై పార్టీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం బెంగాల్ సచివాలయంలో సీఎం మమతా బెనర్జీతో 35 నిమిషాల పాటు సమావేశం అయిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బహరంపూర్ నియోజకవర్గం నుంచి అధీర్ రంజన్ చౌదరి ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఇది కూడా చదవండి: Minister Narayana: అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో త్వరలో చెప్తాం..

కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు లేకుండానే కాంగ్రెస్, టీఎంసీ వేర్వేరుగా ఎన్నికలకు వెళ్లాయి. అధీర్ రంజన్ వైఖరి వల్లే తాము ఒంటరిగా పోటీకి వెళ్లాల్సి వచ్చిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అప్పట్లో ఆరోపించగా, కాంగ్రెస్‌కు గండికొట్టే ఆలోచనలో మమత ఉన్నారంటూ అధీర్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడటంతో పాటు యూసుఫ్ పఠాన్ చేతిలో అధీర్ రంజన్ ఓడిపోయారు. తనను ఓడించేందుకు మమత పన్నిని వ్యూహం ఫలించిందంటూ దీనిపై అధీర్ రంజన్ వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని మతవిశ్వాసాల వారు తనకు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారని అన్నారు. అయితే వరుసగా ఆరోసారి బహరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచేందుకు తగినన్ని ఓట్లు రాలేదని చెప్పారు. 1999 నుంచి బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా అధీర్ రంజన్ ఉన్నారు. అధీర్ రంజన్ వారసుడిగా ఇషా ఖాన్ చౌదరిని నియమించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Hajj pilgrimage: హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మృతి..