NTV Telugu Site icon

Mehreen Pirzada: మెహ్రీన్ పిర్జాదా ‘ఎగ్ ఫ్రీజింగ్’.. వీడియో వైరల్!

Mehreen Pirzada Egg Freezing

Mehreen Pirzada Egg Freezing

Mehreen Pirzada’s Egg Freezing Video: ప్రస్తుతం రోజుల్లో కెరీర్‌, వ్యక్తిగత కారణాల వలన ప్రెగ్నెన్సీని చాలా మంది మహిళలు వాయిదా వేసుకుంటున్నారు. అలాంటి వారికి ‘ఎగ్ ఫ్రీజింగ్’ (అండాల శీతలీకరణ) ఓ వరంగా మారిందని చెప్పొచ్చు. వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకొని.. కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్ధతిని చాలా మంది పాటిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. తాజాగా ఆ లిస్టులో మెహ్రీన్ పిర్జాదా చేరారు.

తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు మెహ్రీన్ పిర్జాదా స్వయంగా తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ‘ఈ ప్రక్రియకు వెళ్లడానికి నా మనసును సిద్ధం చేసుకోవడానికి 2 సంవత్సరాలు ప్రయత్నించా. చివరకు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని మెహ్రీన్ పేరొన్నారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎగ్ ఫ్రీజింగ్ కోసం మెహ్రీన్ ఎంతలా కష్టపడ్డారో వీడియో చూస్తే అర్ధమవుతోంది.

Also Read: BSNL CinemaPlus Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్‌లకు గుడ్‌న్యూస్.. సగానికి తగ్గిన ప్యాక్‌ ధర!

‘నా వ్యక్తిగత విషయాన్ని అందరితో పంచుకోవాలా? వద్దా? అని ఆలోచించా. కానీ నాలాంటి చాలా మంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో లేదా బిడ్డను ఎప్పుడు కనాలో అని ఇంకా వారు నిర్ణయించుకోలేదు. భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యం అని నేను భావించా. ఇది నిషిద్ధ అంశంగా పరిగణించబడుతున్నందున దీని గురించి ఎక్కువగా మాట్లాడలేము. సాంకేతికత సహాయంతో మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాము. తల్లి కావాలనేది నా కల. అయితే కొన్ని సంవత్సరాలు ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఆసుపత్రులంటే ఫోబియా ఉన్న నాలాంటి వారికి ఇది సవాలుగా ఉంటుంది. హార్మోన్ల ఇంజెక్షన్ల కారణంగా నేను ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారీ కళ్లు తిరిగి పడిపోయా. ఇది విలువైనదేనా అని నన్ను అడిగితే.. కచ్చితంగా అవును అని చెబుతా. మీరు ఏ పనిని ఎంచుకున్నా.. మీ కోసం చేయండి. ఎప్పుడూ నా పక్కనే ఉన్న నా గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు ధన్యవాదాలు’ అని మెహ్రీన్ పిర్జాదా పేర్కొన్నారు.