NTV Telugu Site icon

Comedian Ali: ఆలీ… నవ్వుల హోళీ!

Actor Ali

Actor Ali

Comedian Ali Birthday: ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా, అదరక బెదరక ఇట్టే ఆకట్టుకొనే అభినయంతో అలరించే బాలలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నవ్వుల పువ్వులు పూయించే ఆలీ స్థానం ప్రత్యేకమైనది. పన్నెండేళ్ళ ప్రాయంలోనే నటనలోకి అడుగు పెట్టిన ఆలీ అప్పటి నుంచీ ఇప్పటి దాకా తన హాస్యంతో గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లోనూ ఆలీ నవ్వులు పూయిస్తున్నారు. వందలాది చిత్రాలలో ఆలీ అభినయం జనాన్ని ఆకట్టుకుంది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసేసి మురిపిస్తున్నారు ఆలీ.

కళల కాణాచిగా పేరొందిన రాజమహేంద్రవరంలో 1967 అక్టోబర్ 10న కన్ను తెరిచాడు ఆలీ. చదువుకొనే రోజుల్లోనే ఇతరులను ఇమిటేట్ చేస్తూ నవ్విస్తూ కవ్విస్తూ ఉండేవాడు. ‘షోలే’ సినిమాలోని గబ్బర్ సింగ్ డైలాగ్స్ భట్టీయం వేసి పిన్నవయసులోనే ఆలీ చెబుతూ ఉంటే చూసే వారికి ముచ్చటగా ఉండేది. ఓ సారి ఆలీని చూసిన నటుడు జిత్ మోహన్ మిత్రా సినిమాల్లో అవకాశం కల్పించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘నిండు నూరేళ్ళు’లో తొలిసారి తెరపై కనిపించాడు ఆలీ.

ఆ సినిమాలో ఆలీ అభినయం ఆకట్టుకుంది. అదే సమయంలో భారతీరాజా ‘సీతాకోకచిలుక’ రూపొందిస్తూ అందులో హీరో సరసన ఉండే బాలనటుల కోసం అన్వేషిస్తున్నారు. ఆలీని చూడగానే తన సినిమాకు పనికి వస్తాడని ఎంపిక చేసుకున్నారు భారతీరాజా. ‘సీతాకోక చిలుక’లో ఆలీ మంచి గుర్తింపు సంపాదించాడు. ఆపై జంధ్యాల రూపొందించిన ‘మూడు ముళ్ళు’లోనూ బాలనటునిగా ఆలీ భలేగా ఆకట్టుకున్నాడు. అలా బాల్యంలోనే పలు చిత్రాలలో నవ్వులు పూయిస్తూ సాగిన ఆలీ, యుక్తవయసులోనే తనకు దక్కిన పాత్రల్లో నటించి కితకితలు పెట్టారు.

Andrea Jeremiah: బాత్ టబ్ వద్ద పిశాచి.. కిల్లర్ లుక్ లో కూడా కవ్విస్తుందే

ఆలీ నవ్వుల తేరు ఆనందంగా సాగుతూ ఉండగా, ఎస్వీ కృష్ణారెడ్డి తన ‘యమలీల’ చిత్రంలో అతణ్ణి హీరోని చేశారు. ఆ సినిమా స్వర్ణోత్సవం చూసింది. దాంతో వరుసగా ఆలీ కొన్ని చిత్రాలలో హీరోగా నటించారు. వాటిలో “పిట్టలదొర, ఆవారాగాడు, అక్కుమ్ భక్కుమ్, గుండమ్మగారి మనవడు” వంటివి అలరించాయి. అయితే ఆలీ మొదట్లోనే తన బలం హాస్యమేనని తెలుసుకున్నారు. దాంతో హీరో వేషాలే వేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటూ ముందుకు సాగారు. టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాలలోనూ ఆలీ పండించిన హాస్యం గిలిగింతలు పెట్టింది. ఇప్పటికే దాదాపు వేయి చిత్రాలలో ఆలీ నవ్వులు పువ్వులు పూయించారు. మరి మునుముందు ఇంకా ఎన్ని చిత్రాలలో ఆలీ నవ్వుల నావ సాగుతుందో చూడాలి.