NTV Telugu Site icon

TG BJP: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. రేపు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా

Bjp

Bjp

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రస్తుత ప్రభుత్వం కీలక వ్యక్తుల పై చర్యలు తీసుకోవడం లేదని నేతలు విమర్శించారు. బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతలు సీరియస్ గా ఉన్నారు.

READ MORE: CM YS Jagan: ఐదేళ్ల క్రితం ఇదే రోజున అధికారంలోకి వచ్చాం.. సీఎం జగన్‌ ఆసక్తికర ట్వీట్!

ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో విచారణ తీరు నీరు కార్చే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి తప్పుదోవ పట్టించే విధంగా చూస్తున్నాయని ఆరోపించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ రేపు ఇందిరా పార్కు, ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేపీ శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపారు.

కాగా.. తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకి వెల్లవడుతున్నాయి. ఏకంగా 1200 మంది ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో జడ్జిలు, రాజకీయ నేతలు, మీడియా పెద్దలు, వ్యాపార వేత్తలు ఉన్నారని స్పష్టం చేశాడు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సాయంతో 17 సిస్టమ్ ల ద్వారా ట్యాపింగ్ చేశామని ప్రణీత్ వాంగ్మూలం ఇచ్చాడు.