Site icon NTV Telugu

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుడు జైలులో ఆత్మహత్య

Salman Khan

Salman Khan

Salman Khan: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల కేసులో ఇద్దరు ఆయుధాల సరఫరాదారుల్లో ఒకరు ఈరోజు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 26న పంజాబ్‌లో అరెస్టయిన అనూజ్ తపన్ (32) ఉదయం 11 గంటలకు పోలీసు లాకప్‌కు అనుబంధంగా ఉన్న టాయిలెట్‌కి వెళ్లి ఉరివేసుకున్నట్లు సమాచారం. రాత్రి నిద్రించేందుకు కేటాయించిన దుప్పటితో అతడు ఉరి బిగించుకున్నాడు. బుధవారం ఉదయం పోలీసులు సాధారణ తనిఖీ కోసం వెళ్లగా అపస్మారక స్థితిలో పడివున్న అనూజ్‌ తపన్‌ను పోలీసులు టాయిలెట్‌లో గుర్తించారు. అత్యవసరంగా హాస్పిటల్‌కు తరలించినప్పటికీ.. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. అనూజ్ తపన్‌, మరో నిందితుడు సోను సుభాష్ చందర్ ఏప్రిల్ 14న సల్మాన్‌ ఖాన్ ముంబై ఇంటి వెలుపల కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను ఇచ్చారని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనూజ్ తపన్‌ ఆత్మహత్యకు పురికొల్పింది ఏమిటనేది దర్యాప్తులో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also: Blade Attack: బ్లేడ్ తో దాడి చేసుకున్న విద్యార్థినులు.. వైరల్ వీడియో..

కాగా ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులకు పాల్పడ్డ నిందిత షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లకు అనూజ్ తనన్ ఆయుధాలు అందించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఏప్రిల్ 26న అనూజ్‌‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా అనూజ్ ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోందని ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఇది ముమ్మాటికి హత్యేనని మహారాష్ట్ర మాజీ సీనియర్ పోలీసు అధికారి పీకే జైన్ అనుమానం వ్యక్తం చేశారు. లాకప్‌లో ఎవరు మరణించినా హత్యగానే పరిగణించాలని అన్నారు. పోలీసులు సాధారణంగా లాకప్‌లను తనిఖీ చేస్తుంటారని అన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా పోలీసుల నిఘా ఉంటుందని సందేహాలు లేవనెత్తారు.

 

Exit mobile version