Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!

Mutyam Venkataramana

Mutyam Venkataramana

Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తుల సులో ట్రాన్స్‌కో డీఈగా పనిచేసిన ముత్యం వెంకటరమణను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జడ్జి నివాసంలో హాజరుపరిచేందుకు అధికారులు తీసుకెళ్లారు. ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ అధికారులు దాదాపు 14 గంటలపాటు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ప్రస్తుతం తెలంగాణ పునరుత్పాదక ఇంధన సంస్థ (TGREDCO)లో డీజీఎంగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణపై గతంలో నమోదైన కేసుల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

వాస్తవానికి 2019లో లంచం తీసుకుంటూ వెంకటరమణ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అదే రోజు ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ.26 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉండగానే తాజాగా మరోసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు నిర్వహించింది.

తాజా సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.28 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. అయితే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విచారణలో భాగంగా ముత్యం వెంకటరమణ తన భార్య పేరుతో నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలను ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ముత్యం కన్‌స్ట్రక్షన్స్, ముత్యం బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ముత్యం ఏఎన్ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్, ప్రైడ్ హోమ్స్ పేర్లతో సంస్థలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. అలాగే వెంకటరమణ ఆడిటర్ నివాసంలో కూడా సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, సమాచారం స్వాధీనం చేసుకుంది.

సోదాల్లో భారీ స్థాయిలో స్థిరాస్తులు, నగదు, బంగారం వెలుగులోకి వచ్చాయి. మూసాపేట ఆంజనేయ నగర్‌లో సుమారు రూ.20 కోట్ల విలువైన ప్లాట్లు, మాదాపూర్ గుట్టల బేగంపేటలో ఐదంతస్తుల భవనం, కూకట్‌పల్లి ఆంజనేయ నగర్‌లో 160 చదరపు గజాల్లో నిర్మించిన మూడంతస్తుల భవనం, ఇంకా శేర్లింగంపల్లి, కూకట్‌పల్లిలో నాలుగు ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అదేవిధంగా నాలుగు బ్యాంకు ఖాతాల్లో రూ.52 లక్షల నగదు, బ్యాంకు లాకర్లలో రూ.40 లక్షల విలువైన 2,094 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు సుమారు రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, 19 విదేశీ మద్యం బాటిళ్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వెంకటరమణకు సంబంధించిన ఆస్తుల మూలాలు, ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంస్థల కార్యకలాపాలపై సమగ్ర విచారణ చేపడుతున్నారు.