Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!

  • జలమండలి మేనేజర్‌ నివాసంలో ఏసీబీ సోదాలు
  • 100 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు
  • రూ.1.10 కోట్ల నగదు, సుమారు కేజీ బంగారం స్వాధీనం
Water Board Manager Anantha Lakshmi Kumar

Water Board Manager Anantha Lakshmi Kumar

హైదరాబాద్ జలమండలిలో మేనేజర్‌గా పనిచేస్తున్న అనంత లక్ష్మి కుమార్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు.. ఇప్పటికే ఏడు గంటలకు పైగా కొనసాగుతున్నట్లు సమాచారం. సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది.

అనంత లక్ష్మి కుమార్ ఇంట్లో నుంచి రూ.1.10 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కిలో బంగారు ఆభరణాలను కూడా సీజ్ చేశారు. ఇంట్లో దొరికిన నగదు, బంగారం చూసి అధికారులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో మూడు ఫ్లాట్లు, మరో ఆరు ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. నిజామాబాద్ జిల్లాలో మూడు ఎకరాల భూమి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.

సోదాల సమయంలో రెండు కార్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిట్జ్, బ్రిజా కార్లను ఏసీబీ సీజ్ చేసింది. అదేవిధంగా పలు బ్యాంక్ అకౌంట్లు, లాకర్ల వివరాలను కూడా అధికారులు గుర్తించారు. వాటిలో ఉన్న నగదు, ఆభరణాలు, డాక్యుమెంట్లపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. అనంత లక్ష్మి కుమార్ ఆదాయానికి మించి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు.. ఆస్తుల కొనుగోళ్లు, పెట్టుబడులు, కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. సోదాలు పూర్తయ్యాక పూర్తి స్థాయి నివేదిక విడుదల చేసే అవకాశం ఉంది.