NTV Telugu Site icon

ACB Rides: ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్, ధరణి ఆపరేటర్‌

Acb

Acb

ACB Rides: రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే.. వారి రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా.. ఇద్దరు అవినీతి అధికారులు పట్టుబడినట్లు తెలిసింది. ధరణి ఆపరేటర్ అరుణ్ డబ్బులు డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ సంతోష్‌కు కూడా ప్రమేయం ఉన్నట్లు సమాచారం. భూమి మరొకరి పేరుపై పట్టా చేసేందుకు వెంకటేశం అనే వ్యక్తి నుంచి ఆ ఇద్దరు ఉద్యోగులు 30 వేలు డిమాండ్ చేయగా.. సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎమ్మార్వో ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

Read Also: Cyber Cirme : స్టాఫ్ నర్సు ఉద్యోగాల పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలు

మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ మామ ఇటీవల మృతి చెందడంతో ఎకరా 20 గుంటల భూమిని ధరణిలో తన అత్తగారైన జయమ్మ పేరున చేర్చాలని అమీన్ పూర్ తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా.. రూ. 30 వేలు లంచం ఇవ్వాలని ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్ డిమాండ్ చేశారు. బాధితుడు వెంకటేశం ఏసీబీ అధికారులను సంప్రదించి అరుణ్‌ను కలవగా.. అరుణ్‌కు చెందిన TS 15 FB 5102 గల బెలెనో కారు డాష్ బోర్డులో పెట్టమని చెప్పడంతో డాష్ బోర్డులో డబ్బులు పెట్టాడు. లంచం ఇచ్చాకే ధరణిలో పేరును నమోదు చేశారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్ వేణు, రమేష్‌తో కలిసి దాడి చేయగా.. కారు డాష్ బోర్డులో నుంచి లంచం మొత్తం రికవరీ చేసి రసాయన పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. అరుణ్‌ను, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్ ఇళ్లల్లోనూ సోదాలు చేస్తామన్నారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు.