NTV Telugu Site icon

Gujarat Elections : చేతుల్లేకున్నా.. బాధ్యతగా కాళ్లతో ఓటేశాడు

Amit

Amit

Gujarat Elections : ఓట్లొచ్చాయంటే చాలు నాయకుల హడావుడి అంతాఇంతా కాదు.. అప్పటి వరకు మర్చిపోయిన ప్రజలు ఠక్కున గుర్తుకు వస్తారు.. వాళ్లు అడిగిందే ఆలస్యం.. ఏది కావాలంటే అది తథాస్తు అన్నట్లు హామీల వరాలు గుప్పిస్తారు. మద్యం, డబ్బులు, గిఫ్టులు.. ఇలా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఓటరు తనకు ఎవరు బాగా సేవ చేస్తారని తలుస్తారో వారికే ఓటు వేస్తారు.. ఐదేళ్ల కొకసారి వచ్చే ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. అందుకే తప్పకుండా ఓటు వేయాలి.. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి.

Read Also: Airbus Beluga : హైదరాబాద్‎లో ల్యాండైన ఎయిర్ బస్ బెలూగా

ఎన్నికల సమయంలో చాలా మంది తమ హక్కును వినియోగించుకోరు. కొందరైతే ఆఫీసుకు సెలవిస్తే అదేదో హాలిడే అన్నట్లు ఫీలవుతారు. ఇంట్లోనే ఉండిపోవడమో, మరేదైనా పనిలో నిమగ్నమవుతారు. కానీ పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు మాత్రం వేయరు. అలాంటి వాళ్లకు ఓటు విలువ తెలిసి కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటే బద్ధకం. కానీ, ఇవాళ గుజరాత్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో అంకిత్‌ సోని అనే వ్యక్తి తనకు రెండు చేతులు లేకపోయినా కాలితో ఓటువేసి ఔరా అనిపించాడు. ఒంట్లో అన్ని అవయవాలు మంచిగున్నా ఓటు వేసేందుకు బద్దకించేవాళ్లకు చెంపమీద కొట్టినట్లు రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును వినియోగించుకున్నాడు. 20 ఏండ్ల క్రితం తను ఓ ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్నానని అంకిత్‌ సోని తెలిపాడు. అయినా గత ఇరవై ఏళ్లలో ఏనాడూ ఓటు వేయకుండా ఉండలేదన్నాడు. చేతులు లేకపోయినా కాలి వేళ్లతో తాను ఓటు వేస్తానని చెప్పాడు.