Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..

Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma: భారత్-జింబాబ్వే మధ్య ఈ రోజు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్‌లో 6,000 పరుగులు పూర్తి చేయడానికి అతడికి మరో 16 పరుగులు మాత్రమే అవసరం. ఈ మైలురాయిని అందుకుంటే 200 లేదా అంతకంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6,000 పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ 203 టీ20 మ్యాచ్‌ల్లో 199 ఇన్నింగ్స్‌లు ఆడి 5,984 పరుగులు చేశాడు. ఇందులో భారత్ తరఫున 53 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. జింబాబ్వేపై తొలి టీ20లో 16 పరుగులు చేస్తే తన 200వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను అందుకుంటాడు.

ఈ జాబితాలో ప్రస్తుతం కేఎల్ రాహుల్ 166 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 184 ఇన్నింగ్స్‌ల్లో, శుభ్‌మన్ గిల్ 185 ఇన్నింగ్స్‌ల్లో 6,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా ఈ ప్రత్యేక క్లబ్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయిలో చూస్తే వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ కేవలం 162 ఇన్నింగ్స్‌ల్లో 6,000 టీ20 పరుగులు పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 165 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో ఉండగా, కేఎల్ రాహుల్ 166 ఇన్నింగ్స్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో జింబాబ్వేతో తొలి టీ20లో అభిషేక్ శర్మ ఈ అరుదైన రికార్డును అందుకుంటాడా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.