జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఈ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన అభిషేక్ శర్మ, మూడో మ్యాచ్‌లోనూ తక్కువ పరుగులకే వెనుతిరిగి వైఫల్యాన్ని కొనసాగించాడు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్‌లో మరోసారి వికెట్ సమర్పించుకున్నాడు. కేవలం 2 పరుగులు (4 బంతుల్లో) మాత్రమే చేసి, లెంత్ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి కీపర్ తాడివనాషే మరుమానికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మను ముజరబానే పెవిలియన్ చేర్చడం విశేషం.
టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభం…
అంతకుముందు, భారత జట్టు హరారే వేదికగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 2వ ఓవర్‌కే 20 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వేగంగా పరుగులు సాధించాడు. అభిషేక్ వెళ్లిపోవడంతో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న అభిషేక్ శర్మ, మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్, ఈ చివరి మ్యాచ్‌లోనూ నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది.

