Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు

Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో ఆఫ్ఘనిస్థాన్‌పై అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ప్రత్యర్థి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఉతికేస్తూ, చూడచక్కని షాట్లతో మైమరపించిన ఈ డాషింగ్ ఓపెనర్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. తన తుఫాన్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ భారతీయ బ్యాటర్ నమోదు చేసిన వేగవంతమైన సెంచరీ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా టెస్టు హోదా ఉన్న దేశాల ఆటగాళ్లలో కూడా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన శతకంగా ఇది రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా టీ20 ఐలలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు.

ఇక, మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకున్న అభిషేక్ శర్మ తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నాడు. గ్రౌండ్‌లో ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటుంటే శుభాకాంక్షలు చెబుతూ ముచ్చటించిన అతడు, తాను ఇలాంటి అటాకింగ్ గేమ్‌ను ఆడటంలో కెప్టెన్, కోచ్, జట్టు మేనేజ్‌మెంట్ మద్దతు చాలా కీలకమని తెలిపాడు. ఆ ఇద్దరి వల్లే ఈ విధ్వంసకర సెంచరీ సాధ్యమైందని తెలిపాడు. భయం లేకుండా ఆడేందుకు వారిచ్చే నమ్మకమే కారణమని, గత కొన్నేళ్లుగా టీమ్‌లో ఈ విధమైన వాతావరణమే నడుస్తోందని స్పష్టం చేశాడు. మైదానంలో ఏదో ఒక నిర్దిష్ట దిశలోనే కాకుండా, మైదానం నలుమూలలా షాట్లు ఆడటంపై స్పందిస్తూ.. తాను ఎలాంటి పరిమితులు పెట్టుకోనని చెప్పాడు. బంతిని చూసి, దానికి తగ్గట్టుగా ఆడటమే తన మంత్రమని, దేన్నీ బలవంతంగా చేయనని అన్నాడు. మొదటి రోజు నుంచి తన మైండ్ సెట్ చాలా సింపుల్‌గా ఉందని, రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నాడు.

ప్రతి మ్యాచ్‌లోనూ విజయం లేదా సెంచరీ సాధ్యం కాకపోవచ్చని, ఒకటి రెండు సిరీస్‌లలో విఫలమైనంత మాత్రాన బ్యాటింగ్ విభాగాన్ని తక్కువగా అంచనా వేయలేమని అభిషేక్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్‌కు ముందు ఏ జట్టుతో ఆడినా పవర్ ప్లేని ఉపయోగించుకుంటూ మ్యాచ్‌ను డొమినేట్ చేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని వివరించాడు. క్రికెట్‌లో గెలుపోటములు, హెచ్చుతగ్గులు సహజమని, అయితే క్లిష్ట సమయాల్లో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, జట్టు సభ్యుల ఆలోచనా విధానం చాలా ముఖ్యమని చెప్పాడు. ప్రదర్శన క్షీణించినప్పుడు ఒక్కటిగా నిలబడి, తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెట్టి మళ్లీ ఆధిపత్యం చెలాయించడమే తమ నైజమని తెలిపాడు. మైదానంలో ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటానికి వెనుక ఉన్న కష్టాన్ని వివరిస్తూ… ప్రతి సిరీస్‌కు ముందు తాను పాటించే నిర్దిష్టమైన ప్రాసెస్ ఉందన్నాడు. ఏ బౌలర్ వచ్చి బౌలింగ్ చేస్తాడు, పవర్ ప్లేని ఎలా వాడుకోవాలి, 7, 8వ ఓవర్లలో ఎలా ఆడాలి అనే విషయాలపై ముందుగానే పూర్తి ప్రణాళికతో బరిలోకి దిగుతానని, ఆ క్లారిటీయే తనను ఇలా స్వేచ్ఛగా ఆడడేలా చేస్తుందని తెలిపాడు.