Site icon NTV Telugu

Abhishek Nayar: కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్.. ఐపీఎల్ 2026 కేకేఆర్‌ తలరాత మారేనా?

Abhishek Nayar

Abhishek Nayar

Abhishek Nayar: ఐపీఎల్ 2026 సీజన్‌కు జట్లు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాయి. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి ముఖ్యమైన వార్త వచ్చింది. ఈ జట్టు తన కోచింగ్ సెటప్‌లో భారీ మార్పులు చేసింది. కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించింది. గతంలో ఈ టీంకు చంద్రకాంత్ పండిట్ ప్రధాన కోచ్‌గా సేవలు అందించారు. ఆయన స్థానంలో కొత్తగా అభిషేక్ నాయర్ నియమితులయ్యారు.

READ ALSO: Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

ముగిసిన చంద్రకాంత్ పండిట్ పదవీకాలం..
కేకేఆర్ జట్టుతో హెడ్ కోచ్‌గా మూడేళ్లు ఉన్న చంద్రకాంత్ పండిట్ ఇప్పుడు టీంతో విడిపోయారు. పండిట్ పదవీకాలంలో KKR పదేళ్ల తర్వాత 2024లో IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఇది ఆయన కోచింగ్ కెరీర్‌లో ఒక పెద్ద విజయంగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే 2025 సీజన్ జట్టుకు పెద్ద నిరాశను మిగుల్చింది. అజింక్య రహానే కెప్టెన్సీలో KKR పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ పేలవమైన ప్రదర్శన తర్వాత, జట్టు యాజమాన్యం టీంలో మార్పులు చేయాలని నిర్ణయించుకుంది.

కేకేఆర్ గూటికి అభిషేక్ నాయర్ ..
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అభిషేక్ నాయర్‌ హెడ్ కోచ్‌గా తిరిగి వచ్చాడు. ఆయన గతంలో ఫ్రాంచైజీకి అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. అలాగే ఆయన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో UP వారియర్స్‌కు ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు. అక్కడ ఆయన కొత్త ప్రతిభను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు తరపున అభిషేక్ నాయర్ మూడు వన్డేలు ఆడాడు. కానీ ఆయన నిజమైన ప్రతిభ కోచ్, మెంటర్‌గా వ్యవహరించిన సందర్భంలో వెలుగులోకి వచ్చింది. ముంబై క్రికెట్‌లో ఆయన కీలక సభ్యుడిగా ఉన్నారు. దినేష్ కార్తీక్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాతో సహా అనేక మంది భారతీయ ఆటగాళ్ల కెరీర్‌లపై ఆయన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపారు.

రాబోయే నవంబర్ 2025 నెలలో BCCI అన్ని ఫ్రాంచైజీలను వారి రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను అడుగుతుంది. అభిషేక్ నాయర్ నియామకం తర్వాత, ఆయన మొదటి బాధ్యత ఏ ఆటగాళ్లను రిటైన్ చేయాలి, ఎవరిని వేలానికి విడుదల చేయాలి అని నిర్ణయించడం అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. నాయర్ నాయకత్వంలో KKR జట్టు తలరాత ఎంత వరకు మారబోతుందో వేచి చూడాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Yuvraj Singh: ఐపీఎల్‌లో చీఫ్ కోచ్‌గా మారబోతున్న యువరాజ్ సింగ్ .. ఏ జట్టుకో తెలుసా!

Exit mobile version