Site icon NTV Telugu

Annamayya District: “అమ్మా.. నేనేం పాపం చేశా”.. గడ్డివాములో దొరికిన పసికందు

Kid

Kid

అమ్మా…. అనే పిలుపు కోసం తహతహలాడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అమ్మ ప్రేమలో ఎలాంటి కల్తీ ఉండదని అంటారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామం పెద్దహరిజనవాడలో జరిగిన ఘటన తలచుకుంటే ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా అనే అనుమానం కలగక మానదు. ఏప్రిల్ 28న గ్రామ శివారులోని గంగమ్మ గుడి దగ్గర ఉన్న గడ్డివాములో అప్పుడే పుట్టిన మగ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. అదేరోజు ఉదయం 8 గంటల సమయంలో వీరనాగయ్య అనే గ్రామస్తుడు తన గడ్డివాము దగ్గరికి వెళ్లి గడ్డి పీకుతుండగా మగ శిశువు గోన సంచిలో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే వీరనాగయ్య మగ శిశువు ను గ్రామంలోకి తెచ్చి గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే శిశువును రాయచోటిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. మగ శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలపడంతో తిరిగి తన గ్రామానికి తీసుకువచ్చాడు. ఎవరో తల్లి ప్రసవించి అక్కడ వదిలేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: IPL 2025 Final: హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబి..!

ఈ విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకుని మగ శిశువును స్వాధీనం చేసుకుని రాయచోటిలో ఉన్న సఖీ కేంద్రానికి తరలించారు. తనకు సంతానం లేదని ఆ మగ బిడ్డను తనకి ఇస్తే తానే ఆలనా పాలన చూసుకుంటానని గ్రామస్తుడు వీరనాగయ్య అధికారులకు విన్నవించుకున్నాడు. అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా మగ శిశువును అక్కడి నుండి బలవంతంగా తీసుకెళ్లిపోయారు. దాదాపు 36 రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్న జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారులు సంబంధిత మగ బిడ్డను సంబంధిత తల్లిదండ్రులు, సంబంధీకులు బాబుని గుర్తించి తగిన ఆధారాలతో 30 రోజుల్లోపు రాయచోటి పట్టణంలోని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయానికి వచ్చి బాబు ను తీసుకువెళ్లాలంటూ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. లేనిచో ఈ బాబుని అనాధగా ప్రకటించి, ప్రభుత్వ షరతులు, నియమాల ప్రకారం మరొకరికి దత్తత కు ఇవ్వడం జరుగుతుందంటూ అధికారులు తెలిపారు.

Exit mobile version