NTV Telugu Site icon

Delhi: యువతిని ఢీకొట్టి 12 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. ఈ ఘటనపై ఆప్, ఎల్జీ మధ్య మాటల యుద్ధం

Delhi

Delhi

Delhi: నూతన సంవత్సరం వేళ ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఆదివారం తెల్లవారుజామున 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టి ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. కిలోమీటర్ల మేర యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్ల ఆమె శరీరం ఛిద్రమెంది. యువతిని కారు ఈడ్చుకెళ్లడాన్ని చూసిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించగా.. అన్ని చెక్‌పోస్ట్‌లను అలర్ట్‌ చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈలోగా రోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాల ఆధారం కారును గుర్తించిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసారు. ప్రమాదం జరిగిన సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే కారు అద్దాలు మూసి ఉండటం, కారులో పాటలు పెట్టడం వల్ల ప్రమాదాన్ని గుర్తించలేకపోయినట్లు నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆ యువతి శరీరాన్ని ఈడ్చుకుపోయిన కారుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఇది కేవలం ప్రమాదం కాకపోవచ్చని.. కావాలనే చేసి ఉంటారని ఓ ప్రత్యక్ష సాక్షి అనుమానం వ్యక్తం చేశాడు. మృతదేహం కారు చక్రంలో చిక్కుకుని ఉండగా.. కాళ్లు విరిగిపోయినట్లు తెలుస్తోంది. యువతిని కారు ఈడ్చుకెళ్లిన విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయం విని తలకొట్టేసినట్లైందని ట్వీట్ చేశారు. నిందితుల భయంకరమైన ప్రవర్తన ఆందోళనకు గురిచేసిందన్న సక్సేనా.. ఘటనపై పోలీసులతో మాట్లాడినట్లు వివరించారు. ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు అని పేర్కొన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. దోషులను కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు నోటీసులిచ్చింది.

Mexico Prison Attack: జైలుపై ముష్కరుల దాడి.. 17 మంది మృతి.. 25 మంది ఖైదీలు పరారీ

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య పూర్తిస్థాయి మాటల యుద్ధం జరిగింది. ఇది అత్యాచారం, హత్య కేసు అని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్, ఇతర పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎల్జీ వీకే సక్సేనాను బర్తరఫ్ చేయాలని ఆప్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు.సౌరభ్ భరద్వాజ్ ప్రకటనపై రాజ్ నివాస్ వర్గాలు మాట్లాడుతూ.. ఇది ఆప్ ప్రభుత్వం ఘోర వైఫల్యమని ఆరోపించాయి. డిసెంబర్‌ 31న ప్రపంచమంతా సెలవుదినం కాగా.. ఎల్జీ తన విధుల నిర్వహణ కోసం రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు.

ఢిల్లీలోని కంఝవాలా మృతి కేసులో మృతుల పోస్టుమార్టం పూర్తయినట్లు సోమవారం ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, ఈ కేసులో ఐదుగురు నిందితుల రక్త నమూనాలను వారు మద్యం సేవించి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి పరీక్షల కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ విభాగానికి పంపారు. ఐదుగురు నిందితులు మనోజ్ మిట్టల్, దీపక్ ఖన్నా, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్‌లను విచారించేందుకు ఢిల్లీలోని రోహిణి కోర్టు సోమవారం మూడు రోజుల పోలీసు రిమాండ్‌ను మంజూరు చేసింది. నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యాయస్థానంలో హాజరుపరిచారు.