NTV Telugu Site icon

Swamti Maliwal: కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ వెయిట్ చేస్తుండగా జరిగిందిదే..!

Swathi

Swathi

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం ఇంట్లోనే ఏకంగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి.. ఆమెపై దాడికి తెగబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో తలమునకలై తల్లడిల్లుతున్న తరుణంలో మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది.  తాజాగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆప్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని.. ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తోంది.

ఇదిలా ఉంటే స్వాతి మలివాల్‌పై జరిగిన దాడిపై ఆప్ అధికారికంగా స్పందించింది. ఆమెపై దాడి జరిగిన మాట వాస్తవమేనని రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్ తెలిపారు. సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌.. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు అంగీకరించారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ పరిగణనలోకి తీసుకున్నారని, ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటారని మంగళవారం తెలిపారు.

ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె ఫిర్యాదు మాత్రం ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీనిపై మూడు రోజుల్లాగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించగా, ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని బీజేపీ విమర్శలు గుప్పించింది.

అసలేం జరిగిందంటే..
సోమవారం ఉదయం కేజ్రీవాల్‌ నివాసంలోని డ్రాయింగ్‌ రూంలో స్వాతి.. ముఖ్యమంత్రి కోసం ఎదురుచూస్తుండగా.. బిభవ్‌ కుమార్‌ ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెతో మాట్లాడుతుండగానే అమర్యాదగా ప్రవర్తించాడు. అనంతరం ఆమె దాడి చేశాడు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన ఘటన అని సంజయ్ సింగ్ అన్నారు. దీన్ని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. బిభవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారని ఆప్‌ ఎంపీ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ నివాసం నుంచి ఉదయం 9.34 గంటల సమయంలో పోలీసులకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని నార్త్‌ డీసీపీ తెలిపారు. కేజ్రీవాల్‌ సన్నిహితుడు బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశారని ఓ మహిళ ఫోన్‌లో చెప్పారన్నారు. అనంతరం కొద్దిసేపటికి స్వాతి మలివాల్ సివిల్‌ లైన్స్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. దాడి ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటే తప్పనిసరిగా వైద్య పరీక్ష నిర్వహించాలని ఆమెకు పోలీసులు వివరించారు. ఐదు నిమిషాల పాటు స్టేషన్‌లో ఉన్న స్వాతి తాను మళ్లీ వస్తానంటూ ఎటువంటి ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోయారు అని నార్త్‌ డీసీపీ ఎం.కె.మీనా తెలిపారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు స్పందించలేదని బీజేపీ నిలదీసింది. ఒక ఎంపీ, పైగా మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కే రక్షణ కరవైందని.. కేజ్రీవాల్ ఇంట్లోనే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఇంకెవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించడానికి ఇన్ని గంటల సమయం ఎందుకు తీసుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది.

Show comments